Railway Privatisation In India: దేశంలో ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు సంస్థలను ప్రైవేటీకరణ చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్ని ఆరోపణలు, విమర్శలు వస్తోన్నా వెనుకడుగు వేసేది లేనట్లు ముందుకు వెళుతోంది.
తాజా సమాచారం ప్రకారం దేశంలోని సుమారు 90 రైల్లే స్టేషన్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు భారత రైల్వే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచేందుకు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రైవేటీకరణవైపు మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలోనే ప్రైవేటు కంపెనీలు నడుపుతున్న విమానాశ్రయాల నమూనాను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు సంబంధించి రైల్వే బోర్డు.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) చీఫ్ సెక్యూరిటీ కమిషనర్, జోనల్ రైల్వే ప్రధాన అధికారి సలహా కూడా కోరినట్లు తెలుస్తోంది. ఈ 90 స్టేషన్లలో విమానాశ్రయాలలో ఉండేలా భద్రతా ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక రైల్వే స్టేషన్లలో భద్రత బాద్యతను సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తీసుకుంటుంది. ఇదిలా ఉంటే రైల్వేలో భద్రత విషయంలో ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం 2019లోనే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేయమని సదరు కమిటీకి అప్పట్లో బాధ్యతలు ఇచ్చారు.
ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో సుమారు 12కిపైగా ప్రైవేటు రైళ్లు నడపాలని రైల్వే బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి ఈ సంఖ్యను 151 పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక ఇటీవల రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరను కూడా గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే.