Rahul Gandhi: జనంతోనే ఉంటా..? జనంలా ఉంటా.. రూటు మార్చిన రాహుల్ గాంధీ
జనంలో ఉంటేనే ఓట్లు పడతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భావిస్తున్నారా? లారీలలో ప్రయాణించడం, మెకానిక్కులతో కలిసి పనిచేయడం ఆ ప్రయత్నాల్లోనే భాగమేనా? ఈ ఔట్ రీచ్ ప్రోగ్రామ్స్ వెనుక రాజకీయ మతలబు ఉందా?
భారత్ జోడో యాత్రతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనంతో మరింత మమేకమయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. లారీ డ్రైవర్లతో మాట్లాడుతూ లారీల్లో ప్రయాణించిన రాహుల్ తాజాగా మెకానిక్ అవతారం ఎత్తారు. తాజాగా ఆయన ఢిల్లీ కరోల్‌బాగ్‌లో వాహనాల మెకానిక్స్‌ను కలిశారు. వాళ్లతో మాట్లాడుతూ వాళ్లు చేసే పనుల గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ ఫొటోలు ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దేశ చక్రాలను నడిపించడంలో కీలక భూమిక పోషిస్తున్న మెకానిక్స్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని రాహుల్ పేర్కొన్నారు. వారి దుస్తులపై ఉండే మరకలు ఆత్మాభిమానానికి ప్రతీకలను రాహుల్ అభివర్ణించారు. అలాంటి చేతులకు భరోసా ఒక జననాయకుడు మాత్రమే ఇవ్వగలరని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
తాజాగా చేసిన అమెరికా పర్యటనలో కూడా రాహుల్ గాంధీ వాష్టింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు లారీలో ప్రయాణించారు. లారీ డ్రైవర్లు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకున్నారు. దాదాపు 190 కిలోమీటర్ల ఆ ప్రయాణంలో భారత్, అమెరికాలోని ట్రక్ డ్రైవర్ల వర్కింగ్ కండిషన్స్ గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. భారతీయ ట్రక్కులతో పోల్చితే అమెరికా ట్రక్కులు డ్రైవర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయనే విషయాన్ని రాహుల్ గాంధీ గమనించారు. భారతీయ ట్రక్కుల కంటే భద్రతపరంగా అమెరికన్ ట్రక్కులు మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇండియాలోనూ ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ లారీల్లో ప్రయాణించి అందర్ని ఆశ్చర్యపరిచారు. ఢిల్లీ శివారు ముర్తాల్ నుంచి హర్యానాలోని అంబాలా వరకు, అంబాలా నుంచి చండీగఢ్, ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు ఆయన లారీల్లో ప్రయాణించారు. ట్రక్కులో రాత్రంతా ప్రయాణించిన రాహుల్, డ్రైవర్లు ఎదుర్కొనే సమస్యల గురించి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను ముగించినా రకరకాల ప్రయత్నాలు చేస్తూ జనానికి చేరవయ్యే చర్యలు కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం