Delhi Elections: ఎవరికి వారే “యమునా” తీరే, నదీ కాలుష్యంపై ఒకరిపై ఒకరు సెటైర్లు

ఇండీ కూటమి ఏర్పాటైనప్పుడు కాంగ్రెస్, ఆప్ పార్టీలు మిత్రులుగానే ఉన్నాయి. కానీ..ఆ తరవాత క్రమంగా వీళ్ల మధ్య దూరం పెరిగింది. లోక్‌సభ ఎన్నికలప్పుడే వీళ్ల మధ్య విభేదాలు వచ్చాయి. ఎవరి ప్రియార్టీస్ వాళ్లకు ఉండడం, ఎవరి సిద్ధాంతాలు వాళ్లవి కావడం వల్ల పెద్దగొ పొసగలేదు. అప్పుడు మొదలైన దూరం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సందర్బంగా ఈ దూరం కాస్తా వైరంగా మారింది.

Delhi Elections: ఎవరికి వారే యమునా తీరే, నదీ కాలుష్యంపై ఒకరిపై ఒకరు సెటైర్లు
Rahul Gandhi - Kejriwal

Updated on: Feb 03, 2025 | 1:41 PM

గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఢిల్లీ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ..కేజ్రీవాల్‌పై గట్టిగానే కౌంటర్‌లు వేస్తున్నారు. యమునా నదిని స్వచ్ఛంగా తయారు చేస్తానని కేజ్రీవాల్ ఇచ్చిన హామీ ఏమైపోయిందని ప్రశ్నించారు రాహుల్. యమునా నదిలో ఓ సారి స్నానం చేసి వస్తారా అంటూ చురకలు అంటిస్తున్నారు. అంతే కాదు. యమునా నదిలో నీళ్లు తాగి చూడాలని, తరవాత హాస్పిటల్‌కి వచ్చి కలుస్తానని సెటైర్లు వేస్తున్నారు. నిజానికి యమునా నది కాలుష్యం..ఢిల్లీ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాల్లో ఒకటిగా మారిపోయింది. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని పదేపదే ప్రచారంలో ప్రస్తావించారు. ఇప్పుడు రాహుల్ కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

“అరవింద్ కేజ్రీవాల్ కొత్త రాజకీయ వ్యవస్థను సృష్టిస్తా అన్నారు. అవినీతిని అంతం చేస్తామని ప్రగల్బాలు పలికారు. యమునా నదిని స్వచ్ఛంగా మార్చేస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో ఇదంతా జరిగిపోతుందని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ నది అంతే మురికిగా ఉంది. ఓసారి ఆయన అందులో మునక వేయాలి. ఆ నది నీళ్లు తాగాలి. ఆ తరవాత ఆయనను హాస్పిటల్‌లోనే కలవాల్సి వస్తుంది” అని అన్నారు రాహుల్ గాంధీ. ఆప్‌లో కోర్‌ టీమ్ నుంచి ఒక్కరు కూడా వెనకబడిన వర్గానికి చెందిన నేతలు లేరని విమర్శించారు. అంతే కాదు. ప్రధాని నరేంద్ర మోదీకి, అరవింద్ కేజ్రీవాల్‌కి పెద్దగా తేడా ఏమీ లేదని, మోదీ బహిరంగంగా అబద్ధాలు చెబితే..కేజ్రీవాల్ ఆ పనిని సైలెంట్‌గా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీ ఎన్నికలను ప్రేమకి, ద్వేషానికి మధ్య జరుగుతున్న యుద్ధంలా అభివర్ణించారు రాహుల్ గాంధీ. నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఇప్పుడు ప్రధాని అయ్యుండొచ్చని, కానీ ఆయన ఆ పదవి నుంచి దిగిపోతే ఎవరూ గుర్తు పెట్టుకోరని అన్నారు. ఈ దేశంలో రెండు రకాల వ్యక్తులుంటారని…అందులో ఒకరు గాంధీ కాగా మరొకరు గాడ్సే అని వెల్లడించారు. ఈ దేశం గాంధీని మాత్రమే గుర్తు పెట్టుకుంటుందని తేల్చి చెప్పారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..