ఈ మధ్య జాతుల ఘర్షణతో వార్తల్లోకెక్కిన మణిపూర్ రాష్ట్రంలో ఇప్పుడొక ‘గుర్తుతెలియని ఎగిరే వస్తువు’ (UFO) కలకలం సృష్టించింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని విమానాశ్రయానికి సమీపంలో ఆకాశంలో కనిపించిన ఈ వస్తువును చూసి యావత్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎంతగా అంటే.. ఏకంగా రఫేల్ ఫైటర్ జెట్లనే రంగంలోకి దించేంతగా ఈ UFO అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. హై అలర్ట్ నేపథ్యంలో ఇంఫాల్ ఎయిర్‌పోర్టులో దిగాల్సిన విమానాలను గౌహతివైపు దారిమళ్లించడంతో పాటు అప్పటికే ఎయిర్‌పోర్టులో ల్యాండైన విమానాలను సైతం కోల్‌కత్తాకు తరలించాల్సి వచ్చింది. ఇంతకీ ఇది ఎవరి పని? సామ్రాజ్యవాదం – రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న కంత్రీ కంట్రీ చైనా పనా.. లేక గ్రహాంతరవాసుల పనా.?
UFO – అంటే Unidentified Flying Object (గుర్తుతెలియని ఎగిరే వస్తువు) అని అర్థం. సాధారణంగా ఆకాశంలో ఎగిరే విమానాలు, హెలీకాప్టర్లు గ్రౌండ్ స్టేషన్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. ఏది గాల్లోకి ఎగరాలన్నా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) అనుమతి తప్పనిసరి. ఒక్కో విమానానికి నిర్దిష్టమైన ప్రయాణమార్గాన్ని ఏటీసీలు నిర్దేశిస్తాయి. లేనిపక్షంలో గాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. అయితే ఏటీసీ లేదా గ్రౌండ్ స్టేషన్లకు తెలియకుండా గాల్లో ఏదైనా వస్తువు కనిపిస్తే వాటిని UFOలుగా వ్యవహరిస్తుంటారు. 20 శతాబ్దం తొలినాళ్ల నుంచి నేటి వరకు ఇలాంటి అనేక UFOలు వార్తాంశాలుగా మారాయి. సాసర్ ఆకారంలో ఎగురుతున్న వస్తువులను ఆకాశంలో చూశామని అమెరికాలో పలువురు పేర్కొన్నారు. గ్రహాంతరవాసుల పనే అన్న కథనాలు వెలువడ్డాయి. ఈ సందేహాలకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.. కానీ కచ్చితమైన కారణాన్ని ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు.
20వ శతాబ్దం తొలినాళ్లలో కనిపించిన UFOల మిస్టరీ సంగతి ఎలా ఉన్నా.. ఈ మధ్య అమెరికా గగనతలంపై కలకలం సృష్టించిన UFOల మిస్టరీని ఆ దేశ రక్షణ విభాగం బట్టబయలు చేసింది. అవి చైనా ప్రయోగించిన బెలూన్ డ్రోన్లుగా తేల్చింది. అమెరికా నుంచి రహస్య సమాచారాన్ని ముఖ్యంగా రక్షణ శాఖకు చెందిన కీలక టెక్నాలజీ బ్లూ ప్రింట్లను తస్కరించేందుకు చైనా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అమెరికన్ అడ్వాన్స్‌డ్ – ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ల టెక్నాలజీని చైనా ఇలాగే దొంగిలించిందన్న కథనాలు ఉన్నాయి. అమెరికాలో అలాస్కా, కెనడా మీదుగా ప్రయాణించిన చైనా నిఘా బెలూన్‌ను సౌత్ కరోలినా రాష్ట్రంలో గుర్తించిన అమెరికా వెంటనే యుద్ధ విమానాలను రంగంలోకి దింపి కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ బెలూన్ పరిమాణం మూడు బస్సులకు సమానం. అంత పెద్ద బెలూన్‌లో అనేక రకాల పరికరాలు.. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సమాచార సేకరణకు ఉపయోగించే ఏంటెన్నాలు గుర్తించినట్టు అమెరికా ప్రకటించింది. ఈ ఘటన అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. చైనా మాత్రం అది వాతావరణాన్ని పరిశీలించడం కోసం ఉద్దేశించిన బెలూన్ అంటూ తన చర్యలను దాచిపెట్టే ప్రయత్నం చేసింది.
చైనా గూఢచర్యం గురించి ఇంగ్లండ్ మీడియా కొత్త సాక్ష్యాలను బహిర్గతం చేసింది. జపాన్, తైవాన్‌లలో జరిగిన సంఘటనలను సైతం ఉదహరిస్తూ.. తూర్పు ఆసియా సమీపంలో చైనీస్ గూఢచారి బెలూన్‌ల ఫొటోలను సేకరించింది. మంగోలియాకు ఆనుకుని ఉన్న చైనా భూభాగం నుంచి ఈ బెలూన్లను ప్రయోగించినట్టు ఫోటోగ్రాఫిక్ ఆధారాలు సూచిస్తున్నాయి. 2021 సెప్టెంబర్ నెలలో తైవాన్ తీర ప్రాంతంలో ఒక బెలూన్ కనిపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోంటానా రాష్ట్రంలోని అణు వైమానిక స్థావరానికి 130 కి.మీ దూరంలో ఒక బెలూన్ కలకలం సృష్టించింది. ఇప్పుడు తాజాగా మణిపూర్‌లో కనిపించిన బెలూన్ ఇదే కోవలోనిదే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ ప్రాంతాల్లో సరిహద్దులు దాటి ఆక్రమణలకు సైతం తెగబడుతున్న చైనా భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశానికి అష్టదిక్కులా తన స్థావరాలను ఏర్పాటుచేసుకుని తన నిఘాతో పాటు సైనిక చర్యలను పెంచుతోంది. మణిపూర్‌లో కనిపించిన UFO చైనా డ్రోనే అనేందుకు బలమైన కారణాలున్నాయి. సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లోని కోకో ద్వీపంలో చైనా రహస్య సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఇది భారత ఈశాన్య రాష్ట్రాలపై నిఘా పెట్టడంతో పాటు అవసరమైతే ఆ ప్రాంతాలను ఆక్రమించుకునే కుట్రలో భాగంగా ఏర్పాటైంది.
ఈ ఏడాది జనవరిలో మాక్సర్ టెక్నాలజీస్ తీసిన శాటిలైట్ ఫొటోల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మయన్మార్ అధీనంలో ఉన్న కోకో ద్వీపంలో సైనిక నిర్మాణ కార్యకలాపాలు ఇందులో స్పష్టంగా కనిపించాయి. ఇక్కడ కొత్తగా నిర్మించిన రెండు హాంగర్లు, వాటికి ఉత్తరాన కొన్ని కొత్త భవనాలు కూడా కనిపిస్తాయి. ఫొటోలో 2,300 మీటర్ల పొడవైన రన్ వే కూడా కనిపిస్తోంది. పదేళ్ల క్రితం ఈ రన్ వే పొడవు కేవలం 1,300 మీటర్లే ఉండేది. చైనా చాలాకాలంగా హిందూ మహాసముద్రంలో తన పరిధిని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. కోకో ద్వీపాల్లో కొత్త నిర్మాణాలు నేరుగా చైనాయే చేపట్టిందా లేక చైనా ఆదేశాల మేరకు మయన్మార్ చేపట్టిందా అన్న విషయంలో స్పష్టత లేదు. కానీ ఇది కచ్చితంగా చైనా ప్రమేయంతో జరుగుతున్న పనే అన్నది వివిధ దేశాల నిఘా సంస్థల అంచనా. చైనా గతంలోనే ఈ దీవిని తన సైనిక అవసరాల కోసం ఉపయోగించుకుంది. ద్వీపంలో చైనా ఇటువంటి అనుమానాస్పద చర్యలు కొత్తవేమీ కాదు. 2009లో మయన్మార్‌తో భారత్ ఈ అంశాన్ని లేవనెత్తింది. 1990వ దశకం ప్రారంభంలో కూడా, చైనా ఈ దీవులను సైనిక, నౌకాదళ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని కథనాలు వచ్చాయి.
మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్- 2014లో ఇచ్చిన ఓ నివేదిక ప్రకారం చైనా కనీసం అండమాన్ సముద్రం, మయన్మార్‌లోని కోకో దీవులలో మనౌంగ్, హింగి, జాడెట్కీలలో SIGINT శ్రవణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇక్కడ చైనీస్ సాంకేతిక నిపుణులు, శిక్షకులు యాంగోన్, మౌల్మీన్ మరియు మెర్గుయ్ సమీపంలోని నావికా స్థావరాలలో శిక్షణ పొందారు. అలాగే రాడార్‌తో కూడిన నావికా స్థావరాన్ని స్థాపించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఇదిలా ఉంటే.. ఈ మధ్య అండమాన్ దీవుల్లో మయన్మార్ జెండాలను ఎగురవేస్తున్న ఫిషింగ్ ట్రాలర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ నిలిపివేసింది. వాటిని తనిఖీ చేయగా.. అందులో ఉన్నవారంతా చైనీస్ జాతీయులుగా తేలింది. వారి వద్ద అధునాతన రేడియోలతో పాటు జలాంతర్గాములలో ఉపయోగించే డెప్త్ సౌండర్‌లను కోస్ట్ గార్డ్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామాలన్నీ చైనా ప్రయత్నాలను స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మణిపూర్‌లో ప్రత్యక్షమైన UFO కచ్చితంగా చైనా కుట్రలో భాగమేనన్న అనుమానాలు బలపడుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..