Devadasi Parasmani Devi dies: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథుని ఆలయ చివరి దేవదాసి పారస్మణి దేవి (90) ఆదివారం కన్నుమూశారు. వృద్ధాప్యంలో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. పూరిలోని 11 వ శతాబ్దపు శ్రీ జగన్నాథ ఆలయానికి చివరి దేవదాసిగా ఉన్న పారస్మణి మరణంతో.. ఈ సంప్రదాయం ముగిసింది. పార్సు మహారీగా పిలిచే పారస్మణి శ్రీ జగన్నాథ ఆలయంలో స్వామి వారి ఎదుట పాటలు పాడుతూ.. నృత్యం చేసేవారు. పారస్మణి ఆలయంలో సేవలు అందించడమే కాకుండా.. ఆధ్యాత్మిక చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా రేడియో కళాకారిణిగా.. ఒడిస్సీలో జగన్నాథుడికి సంబంధించిన పాటలు పాడుతూ ప్రసిద్ధి చెందారు.
ఆమె శ్రావ్యమైన స్వరంతో పాటలు పాడేవారు. పారస్మణి ఒడిస్సీ సంగీతాన్ని ప్రముఖ గాయకుడు దివంగత సింఘారీ శ్యామ్ సుందర్ కర్ నుంచి నేర్చుకున్నారు. హార్మోనియం, ఒడిస్సీ సంగీతాన్ని ఆమె పెంపుడు తల్లి దేవదాసి కుండమణి దేవి నుంచి నేర్చుకున్నారు. పరాస్మణి దాదాపు ఎనిమిది దాశాబ్ధాలుగా జగన్నాధుని ఆలయంలో సేవలందించారు. వృద్ధాప్యం కారణంగా 2010 నుంచి సేవలకు దూరమయ్యారు. కానీ.. పారస్మణి గత పదేళ్ల నుంచి ప్రతిరోజూ భగవంతుడి కోసం గీత గోవిందను పఠిస్తూ ఉండేవారు. 2015 లో దేవదాసి శశిమణి దేవి కన్నుమూసిన తరువాత.. పూరి మందిరంలో మిగిలి ఉన్న చివరి దేవదాసి పారస్మణి అని ఆలయ అధికారులు వెల్లడించారు. 11 ఏళ్ల ప్రాయం నుంచి పారస్మణి దేవదాసి భగవంతుడికి సేవలందిస్తున్నారు.
పారస్మణి మృతదేహానికి స్వర్గద్వార్ వద్ద శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె బంధువు ప్రసన్న కుమార్ భౌతికకాయానికి నిప్పు పెట్టారు. కాగా.. ఒడిశాలో రాజ్యస్వామ్యాన్ని రద్దు చేసిన తరువాత దేవదాసి సంప్రదాయం క్షీణించింది.
Also Read: