పంజాబ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి షాక్‌.. సింగర్‌ సిద్దు హత్య తరువాత ప్రభుత్వం తీరుపై కోర్టు సీరియస్‌..

వీఐపీ సెక్యూరిటీ విషయంలో పంజాబ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి షాక్‌ తగిలింది. భద్రత తొలగించిన 424 మందికి సెక్యూరిటీని పునరుద్దరించాలని ఆదేశాలు జారీ చేసింది.

పంజాబ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి షాక్‌.. సింగర్‌ సిద్దు హత్య తరువాత ప్రభుత్వం తీరుపై కోర్టు సీరియస్‌..
Sidhu Musewala

Updated on: Jun 02, 2022 | 7:29 PM

ప్రముఖ సింగర్‌ , కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్య తరువాత హాట్‌టాపిక్‌గా మారిన వీఐపీ సెక్యూరిటీ కుదింపు విషయంలో పంజాబ్‌ ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. భద్రత తొలగించిన 424 మందికి సెక్యూరిటీని పునరుద్దరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు తరువాత వీఐపీల భద్రత ఉపసంహరణ, కుదింపు విషయంలో పంజాబ్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జూన్‌ 7 నుంచి మొత్తం 424 మంది వీఐపీలకు పోలీసు భద్రతను పునరుద్ధరిస్తామని తెలిపింది. పంజాబ్‌ – హర్యానా హైకోర్టుకు ఈ విషయాన్ని తెలియజేసింది. వీఐపీల భద్రత విషయంలో జూన్‌ 2లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు ఇటీవల పంజాబ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తన భద్రతను తగ్గిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

జూన్‌ 6న ఆపరేషన్ బ్లూస్టార్ వార్షికోత్సవం సందర్భంగా భారీఎత్తున భద్రతా సిబ్బంది అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సింగర్‌ మూసేవాలాతో పాటు 424 మందికి భద్రత అందుకు కుదించినట్టు వివరణ ఇచ్చిది. జూన్‌ 7 నుంచి తప్పకుండా అందరికి భద్రత పునరుద్దరిస్తామని హైకోర్టులో పంజాబ్‌ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

పంజాబ్‌ పోలీసులు భద్రత ఉపసంహరించిన మరుసటి రోజే మే 29న మాన్సా జిల్లాలో సిద్ధూ హత్యకు గురయ్యారు. భద్రత కుదింపుతోనే ఈ ఘటన జరిగిందంటూ.. భగవంత్‌ మాన్‌ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని, మాన్‌ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని విపక్ష నేతలు మండిపడ్డారు.