Punjab Assembly Election 2022: పంజాబ్‌లో మళ్లీ అధికార పగ్గాలు హస్తగతం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే సీఎం ఎవరవుతారన్న అంశంపై ఆ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సీఎం ఎవరన్నది నిర్ణయించేది పార్టీ అధిష్టానం కాదు.. ప్రజలేనంటూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ(Sidhu) మొన్న ఆ మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తనకు పదవులు ముఖ్యంకాదని చెప్పుకొస్తున్నారు. అటు సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే మంచిదని పార్టీ అధిష్టానాన్ని కోరారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంచేసింది. సమిష్టి నాయకత్వంతో ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఓ వీడియో ద్వారా పంజాబ్‌లో తమ పార్టీ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా క్లారిటీ ఇచ్చేసింది. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి చన్నీయేనని చెప్పకనే చెప్పింది. ఆ మేరకు 36 సెకన్ల నిడివి కలిగిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ఈ వీడియోను పంజాబ్ కాంగ్రెస్ రీట్వీట్ చేసింది.
నిజమైన ముఖ్యమంత్రి లేదా రాజు దానికి అవసరమైన అర్హతలు కలిగి ఉంటారని, బలవంతంగా కుర్చీ మీదకు తీసుకురాబడుతారని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వ్యాఖ్యలు చేయడం ఆ వీడియోలో ఉంది. వెనుక బెంచ్‌లో ఉన్నా అలాంటి వారిని ముందు బెంచ్‌కి తీసుకొస్తారని వ్యాఖ్యానించారు. తమకు తాము ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకునే వారు నిజమైన ముఖ్యమంత్రులు కాలేరని పేర్కొన్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చన్నీ దృశ్యాలను కూడా ఈ వీడియోలో చేర్చారు. ఈ వీడియోలో ఎక్కడా సిద్ధూను చూపించలేదు. దీంతో తమ సీఎం అభ్యర్థి చన్నీయేనని కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా స్పష్టంచేసినట్లు అందరూ భావిస్తున్నారు. అయితే సిద్ధూ వర్గీయులను ఈ వీడియో కాస్త అసంతృప్తికి గురిచేస్తోంది.
Watch Video
बोल रहा पंजाब, अब पंजे के साथ- मजबूत करेंगे हर हाथ। pic.twitter.com/qQOZpnKItd
— Congress (@INCIndia) January 17, 2022
పంజాబ్ సీఎం అభ్యర్థిని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటిస్తున్న నేపథ్యంలోనే ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేయడం విశేషం.
పంజాబ్ అసెంబ్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. సోనూ సూద్ సోదరి మాల్విక సూద్ కాంగ్రెస్ టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించడం తెలిసిందే.
Also Read..
Andhra Pradesh: నెల్లూరులో చిన్నారి అపహరణ.. గంటల వ్యవధిలోనే చేధించిన పోలీసులు..
Covid-19: బెజవాడ ఆస్పత్రిలో కరోనా కలకలం.. వైద్యులు సహా 50 మంది సిబ్బందికి పాజిటివ్..