Amarinder Singh Resign: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా.. వేరు కుంపటి పెట్టుకోనున్న కెప్టెన్.!

|

Sep 18, 2021 | 5:15 PM

Punjab Chief Minister Resign: పంజాబ్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు చివరి దశకు చేరింది. కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రాజీనామా చేశారు.

Amarinder Singh Resign: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా.. వేరు కుంపటి పెట్టుకోనున్న కెప్టెన్.!
Punjab Cm Resigns
Follow us on

Punjab – Amarinder Singh: పంజాబ్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు చివరి దశకు చేరింది. కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రాజీనామా చేశారు.  కొంచెం సేపటి క్రితం పంజాబ్ గవర్నర్ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. .  గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూతో నెలకొన్న ఆధిపత్య పోరు చివరికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేసే పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ అధినేత్రి ఆదేశాల మేరకు అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. ఈ సాయంత్రం ఐదు గంటలకు పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరుగుతోన్న నేపథ్యంలో అమరీందర్ రాజీనామా చేయడం విశేషం.

కాగా, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌ నవజోత్‌ సింగ్ సిద్ధూతో విభేదాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా అనే సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం.. తాను అధికారంలో కొనసాగలేనంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి అమరీందర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. సోనియా మాట ప్రకారం, ఇన్నాళ్లూ అన్ని రాజకీయ మార్పులను అంగీకరించానని, కానీ ఇకపై పార్టీలో కొనసాగలేనని అమరీందర్ తన లేఖలో స్పష్టం చేశారు. ఈ అవమానాలు చాలని, ఇలా జరగడం ఇది మూడోసారని సింగ్‌ ఆవేదన వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇలాఉండగా, పంజాబ్ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్ సిద్ధూ మరికాసేపట్లో సీఎల్‌పీ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా నాయకత్వ మార్పుపై ఎమ్మెల్యేల సమావేశంలో చర్చించనున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. గత కొన్ని నెలలుగా కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై ఒక వర్గం ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. కొత్త నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.

మరోవైపు సునీల్ జాఖర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ ప్రతాప్ సింగ్ బజ్వా, బియాంత్ సింగ్ మనవడు ఎంపీ రవనీత్ సింగ్ బిట్టూలలో ఒకర్ని కొత్త సీఎంగా నియమించనున్నారనే అంచనాలు కూడా భారీ గానే ఉన్నాయి. కాగా పంజాబ్ పీసీసీ పగ్గాలను ఎమ్మెల్యే సిద్దూకు అప్పగించే విషయమై పార్టీలో దుమారం రేగిన సంగతి తెలిసిందే. సిద్దూకు అధ్యక్ష బాధ్యతలను అప్పజెప్పేందుకు అమరీందర్ ససేమిరా అన్నారు. మరి పంజాబ్‌ కాంగ్రెస్‌ పాలిటిక్స్‌ ఏ మలుపు తీసుకుంటాయో వెయిట్‌ చేయాలి.

Read also: సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి