పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. నూతన సంవత్సరానికి వినూత్న రీతిలో నిరసనపూర్వక స్వాగతం పలుకుతూ.. ఢిల్లీలో మంగళవారం అర్ధరాత్రి ప్రజలు సామూహిక ధర్నా చేశారు. సౌత్ ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో పెద్ద సంఖ్యలో మహిళలు గజగజ వణికిస్తున్న చలిలోనే నిరసనకు పూనుకొన్నారు. 118 ఏళ్లలో..డిసెంబరులోనే రెండో సారి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయిన రోజున.. వీరిలా ధర్నా చేశారు. చాలామంది మహిళలు తమ చంటిబిడ్డలతో సహా ఈ నిరసనలో పాల్గొనడం విశేషం. వీరికి ఇతరులు టెంట్లు, దుప్పట్లు, ఏర్పాటు చేయడమే కాక.. ఆహారం కూడా అందించారు. సవరించిన పౌరసత్వ చట్టం వల్ల తమ పిల్లలకు ఒరిగేది శూన్యమని, వారికి అసలు భవిష్యత్తు అంటూ ఉండదని, అందువల్లే ఈ ప్రొటెస్ట్ లో పాల్గొన్నానని ఓ పసిపాప తల్లి తెలిపింది. ఇది కేవలం తన పోరాటం మాత్రమే కాదని, రాజ్యాంగ పరిరక్షణ జరగాలని కోరేవారి అందరి పోరు అని ఆమె పేర్కొంది. మరో యువతి.. 2014 లో తానూ జామియా మిలియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ అందుకున్నానని, మతం ఆధారంగా ఆ విశ్వవిద్యాలయంలో వివక్ష లేదని పేర్కొంది. మొట్టమొదటిసారిగా నేనీ నిరసనలో పాల్గొంటున్నాను.. అని ఏడాది వయసున్న తన పాపతో సహా వఛ్చిన ఆమె వెల్లడించింది.
అస్మా ఖాతూన్ అనే 90ఏళ్ళ వృధ్ధురాలు.. తను రోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలవరకు షాహీన్ బాగ్ వద్ద ధర్నా చేస్తున్నట్టు చెప్పింది. కాగా-అనేకమంది తమ చేతుల్లో జాతీయ పతాకాలను పట్టుకుని వచ్చారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు కాగానే.. నూతన సంవత్సరం అడుగుపెట్టగానే వీరంతా ‘ జనగణమన ” .. జాతీయగీతం ఆలపించారు.