Delhi-Dehradun corridor: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీ డెహ్రడూన్ కారిడార్‌తోపాటు రూ. 18,000 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా డెహ్రడూన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగసభలో ప్రధాని ప్రసంగించారు. గత ఐదేళ్లలో ఉత్తరాఖండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. కేంద్రం కేటాయించిన అభివృద్ధి ప్రాజెక్టులలో రూ.18,000 కోట్లకు పైగా కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించినట్లు ప్రధాని వెల్లడించారు. దేశమంతటా.. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం.. 100 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
దీనిలో భాగంగా ఈరోజు ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఢిల్లీ నుండి డెహ్రాడూన్‌కు ప్రయాణించడానికి పట్టే సమయం దాదాపు సగానికి తగ్గుతుందన్నారు. కొండ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయలేదంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను విమర్శించారు. అన్ని ప్రాంతాలను నిరుత్సాహపరిచారని, ముఖ్యంగా సైన్యాన్ని కూడా విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఒక ర్యాంక్, ఒకే పెన్షన్ విధానాలను అమలు చేశామన్నారు. సైన్యానికి ఆధునిక ఆయుధాలను అందించామని.. ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇచ్చామమని ప్రధాని తెలిపారు.
మన పర్వతాలు, సంస్కృతి మన విశ్వాసం మాత్రమే కాదు మన దేశ భద్రతకు కోటలు కూడా అని ప్రధాని పేర్కొన్నారు. పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన సౌలభ్యానికి తాము ప్రాధాన్యతనిస్తామని స్పష్టంచేశారు. అయితే.. దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగిన వారు.. ఈ విధాన వ్యూహాన్ని అవలంభించలేదంటూ ఆగ్రహించారు.
2007 – 2014 మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రూ. 600 కోట్ల విలువైన 288 కిలోమీటర్ల జాతీయ రహదారులను మాత్రమే నిర్మించిందని ప్రధాని గుర్తు చేశారు. అయితే తమ ప్రభుత్వం 7 సంవత్సరాలలో ఉత్తరాఖండ్‌లో రూ.12,000 కోట్ల విలువైన 2,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ జాతీయ రహదారులను నిర్మించిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Prime Minister Narendra Modi inaugurates & lays the foundation stone of multiple projects worth around Rs 18,000 crores in Dehradun, Uttarakhand pic.twitter.com/iPNm8wjeMq
— ANI (@ANI) December 4, 2021