Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపవి ముర్ము విజయంపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్న భారతీయ జనతా పార్టీ భారీ ప్లాన్ చేస్తోంది. జులై 21న ఫలితాలు వెలువడిన వెంటనే లక్షకు పైగా గిరిజన గ్రామాల్లో సంబరాలు జరుపుకోవాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముర్ము విజయాన్ని ప్రకటించిన తరువాత.. దేశ వ్యాప్తంగా లక్షకు పైగా గిరిజన గ్రామాల్లో ఈ వియోజవత్సవాలను నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు బీజేపీ అధిష్టానం ఇప్పటికే సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. దాదాపు 15 వేల మండలాల్లో సంబరాలు జరుపుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. గిరిజన గ్రామాల్లో ద్రౌపది ముర్ము హోర్డింగ్‌లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజున ముర్ము ఫోటో తప్ప మరే ఇతర నాయకుడి పోస్టర్లు కూడా వేయకూడదని కూడా పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇలా చేయడం ద్వారా దేశంలోనే తొలి గిరిజన మహిళ అత్యున్నత పదవిని అధిరోహించిందన్న సందేశం దేశం మొత్తానికి వెళ్లడమే కాకుండా, యావత్ గిరిజన సమాజానికి పార్టీని చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ.
కాగా, ముర్ము జార్ఖండ్ మాజీ గవర్నర్, ఒడిశా మాజీ మంత్రి. ఇప్పుడు రాష్ట్రపతిగా విజయం సాధిస్తే.. భారతదేశానికి మొదటి గిరిజన రాష్ట్రపతిగా ఆమె రికార్డులకెక్కుతుంది. అలాగే.. దేశానికి రెండవ మహిళా రాష్ట్రపతి అవుతారు. ఒడిశాలోని వెనుకబడిన జిల్లా మయూర్‌భంజ్ గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించిన ముర్ము.. అనేక సవాళ్లను అధిగమించి ఉన్నత స్థానానికి చేరారు.
ముర్ము 2013 నుండి 2015 వరకు BJP ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు. 2010 నుంచి 2013 వరకు మయూర్‌భంజ్(పశ్చిమ) BJP జిల్లా చీఫ్‌గా పనిచేశారు. 2006 – 2009 మధ్య ఒడిశాలో BJP ST మోర్చా చీఫ్‌గా ఉన్నారు. 2002 – 2009 వరకు BJP ST మోర్చా జాతీయ కార్యవర్గంలో సభ్యురాలు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ముర్ముకు.. ఎన్డీయే పక్షాలతో పాటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేడీ, అకాలీదళ్, జార్ఖండ్ ముక్తి మోర్చా మద్ధతు ప్రకటించాయి.
మరోవైపు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపాయి. భారత తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ జరుగనుండగా.. జూలై 21న కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.