Presidential Elections 2022: ఉమ్మడి అభ్యర్థికి విపక్షాలు అంతా ఓకే.. తేలాల్సింది ఆ ఒక్కటే.. తెరమీదకు మరో ఇద్దరి పేర్లు
ఇందులో భాగంగా మమత బెనర్జీ నేతృత్వంలో విపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. 21 పార్టీలకు ఆహ్వానం అందినా 16 మంది వచ్చారు. అయితే ఉమ్మడి అభ్యర్ధిపై ఏకాభిప్రాయం రాలేదు. రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి..
Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది.. ఇప్పటికే గజిట్ కూడా విడుదల అయింది. ఈ నేపథ్యంలో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నిక లేకుండా ఏకాభిప్రాయం ద్వారా తమ రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకోవాలని అధికార పార్టీ(BJP) ప్రయత్నిస్తోంది. అయితే ఎన్డీయే ఎవరిని పెట్టినా కూడా వ్యతిరేకించి తమ పంతం నెగ్గించుకోవాలని పట్టుదలగా ఉన్నాయి విపక్షాలు. ఇందులో భాగంగా మమత బెనర్జీ నేతృత్వంలో విపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. 21 పార్టీలకు ఆహ్వానం అందినా 16 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి వచ్చారు. అయితే ఈ సమావేశంలో ఉమ్మడి అభ్యర్ధిని నిలిపే విషయంలో ఏకాభిప్రాయం కుదిరినా.. ఎవరిని బరిలో నిలపాలన్న అంశంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నట్లు మమతా బెనర్జీ భేటీ అనంతరం తెలిపారు. ‘ఈ అభ్యర్థికి అందరూ తమ మద్దతు ఇస్తారు. మేము ఇతరులతో సంప్రదిస్తాము. ఇది మంచి ప్రారంభం. మేము చాలా నెలల తర్వాత కలిసి కూర్చున్నాము. మేము మళ్లీ సమావేశాన్ని నిర్వహిస్తాం’ అని మమత తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించేందుకు ప్రతిపక్ష పార్టీల తదుపరి సమావేశం జూన్ 21న జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి శరద్ పవార్ నో..
అయితే.. మహారాష్ట్ర నాయకుడు శరద్ పవార్ ఇవాళ ప్రతిపక్ష పార్టీల సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. శరద్ పవార్ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా మమత ప్రతిపాదించగా.. కాంగ్రెస్, శివసేన మద్ధతు తెలిపాయి. అయితే పవార్ అందుకు సున్నితంగా నిరాకరించినట్లు తెలిసింది. తనకు ఇంకా యాక్టివ్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఉందని శరద్ పవార్ అన్నట్లు తెలిసింది. మమతా బెనర్జీ మాట్లాడుతూ శరద్ పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయమని మరోసారి అభ్యర్థించామని తెలిపారు. అయితే అందుకు ఆయన విముఖత వ్యక్తంచేసినట్లు వెల్లడించారు. మళ్లీ ఒప్పించే ప్రయత్నం చేస్తామని.. అందుకు ఆయన ఒప్పుకోకపోతే మరో అభ్యర్థి గురించి ఆలోచిస్తామని తెలిపారు.
తెరమీదకు మరో ఇద్దరి పేర్లు..
విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మరో ఇద్దరు పేర్లు తెరమీదకు వచ్చాయి. రాష్ట్రపతి రేసులో శరద్ పవార్ ఉన్నట్లు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి బుధవారంనాటి విపక్షాల సమావేశంలో ఫుల్ స్టాప్ పడింది. దీంతో పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్ కృష్ణ గాంధీ, నేషనాల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పేర్లను కూడా మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వీరిలో గోపాల్‌కృష్ణ గాంధీ అభ్యర్థిత్వాన్ని వామపక్షాలు మొదటి నుంచీ ప్రతిపాదిస్తున్నాయి. శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించడంతో గాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీ పేరు తెరపైకి వచ్చింది.
సమావేశానికి చాలా పార్టీలు దూరం..
జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిపై చర్చించేందుకు మమతా బెనర్జీ పిలిచిన ఈ ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ఐదు ప్రధాన పార్టీలు గైర్హాజరయ్యాయని మీకు తెలియజేద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) సమావేశానికి దూరంగా ఉన్న పార్టీలలో ప్రముఖమైనది. దీంతో పాటు నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ, శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన AIMIM కూడా సమావేశానికి దూరంగా ఉన్నాయి.