Budget Session 2024: బడ్జెట్ సమావేశాల్లో అపూర్వ ఘట్టం.. రాజదండంతో రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం..

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ స్పీకర్‌, పార్లమెంట్‌ సెక్రటరీ రాజదండంతో లోక్‌సభలోకి ప్రవేశించారు. సెంగోల్‌తో రాష్ట్రపతికి స్పీకర్ ఓంబిర్లా స్వాగతం పలికారు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజదర్పాన్ని ప్రదర్శిస్తూ గుర్రపుబండిలో పార్లమెంట్ భవనానికి విచ్చేశారు.

Budget Session 2024: బడ్జెట్ సమావేశాల్లో అపూర్వ ఘట్టం.. రాజదండంతో రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం..
Budget Session 2024

Updated on: Jan 31, 2024 | 11:32 AM

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ స్పీకర్‌, పార్లమెంట్‌ సెక్రటరీ రాజదండంతో లోక్‌సభలోకి ప్రవేశించారు. సెంగోల్‌తో రాష్ట్రపతికి స్పీకర్ ఓంబిర్లా స్వాగతం పలికారు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజదర్పాన్ని ప్రదర్శిస్తూ గుర్రపుబండిలో పార్లమెంట్ భవనానికి విచ్చేశారు. రాజదండంతో రాష్ట్రపతికి లోక్‌సభ స్పీకర్‌, ఉపరాష్ట్రపతి ధన్కర్‌, ప్రధాని మోదీ స్వాగతం పలికారు. రాష్ట్రపతి ముర్ము పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇది తన తొలి ప్రసంగం అంటూ పేర్కొన్నారు. వికసిత భారతాన్ని నిర్మిస్తామని ముర్ము పేర్కొన్నారు. ఈ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకూ కొనసాగుతాయి. ప్రస్తుత 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కాగా, నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాక తొలిసారిగా బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం రేపు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇక గత సమావేశాల్లో జరిగిన దాడితో అలర్టయిన కేంద్రం.. ఈ సమావేశాలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతి సమస్యపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, విపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ కోరారు. నారీ శక్తిని కేంద్రం ప్రతిబింబిస్తోందన్నారు. శాంతి పరిరక్షణలో నారీశక్తి పాత్ర ఎంతో కీలకమైందన్నారు ప్రధాని మోదీ.

లైవ్ వీడియో చూడండి..

ప్రస్తుత లోక్‌సభకు చివరి సమావేశాలు కావడంతో సుహృద్భావ వాతావరణంలో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులు ఆమోదించే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయగా వారిలో 132 మందిపై దీన్ని ఆ సెషన్‌ వరకే పరిమితం చేశారు. మిగతా 14 మందిలో 11 మంది రాజ్యసభ సభ్యులు, ముగ్గురు లోక్‌సభ సభ్యులున్నారు. ఈ 14 మంది సభ్యుల కేసును ఉభయసభల ప్రివిలేజ్‌ కమిటీలకు పంపారు. జనవరి 12న లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ ముగ్గురు లోక్‌సభ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఇక రాజ్యసభకు చెందిన ప్రివిలేజ్‌ కమిటీ కూడా 11 మంది సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..