AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రమాదంలో అన్నాడీఎంకే అస్తిత్వం.. ముగింపు దశకు ఎంజీఆర్, జయలలిత వారసత్వం..?

తమిళనాడు రాజకీయ చరిత్రలో అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (AIADMK) ఒక ప్రభంజనం. ఐదు దశాబ్దాల క్రితం, ద్రావిడ రాజకీయ దిగ్గజం అన్నాదురై ఆశయాలతో, ప్రజల హృదయాలను గెలిచిన నటుడు ఎం.జి.రామచంద్రన్ (MGR) స్థాపించిన ఈ పార్టీ, తమిళనాడును దశాబ్దాల పాటు శాసించింది. డీఎంకే అధినేత కరుణానిధితో విభేదించి ఎంజీఆర్ పెట్టిన ఈ పార్టీ, తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది.

ప్రమాదంలో అన్నాడీఎంకే అస్తిత్వం.. ముగింపు దశకు ఎంజీఆర్, జయలలిత వారసత్వం..?
Aiadmk Party
Ch Murali
| Edited By: |

Updated on: May 14, 2026 | 5:23 PM

Share

తమిళనాడు రాజకీయ చరిత్రలో అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (AIADMK) ఒక ప్రభంజనం. ఐదు దశాబ్దాల క్రితం, ద్రావిడ రాజకీయ దిగ్గజం అన్నాదురై ఆశయాలతో, ప్రజల హృదయాలను గెలిచిన నటుడు ఎం.జి.రామచంద్రన్ (MGR) స్థాపించిన ఈ పార్టీ, తమిళనాడును దశాబ్దాల పాటు శాసించింది. డీఎంకే అధినేత కరుణానిధితో విభేదించి ఎంజీఆర్ పెట్టిన ఈ పార్టీ, తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఎంజీఆర్ మరణానంతరం, ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని పార్టీని చేతుల్లోకి తీసుకున్న ‘పురట్చి తలైవి’ జయలలిత అన్నాడీఎంకేను ఒక ఉక్కుకోటలా మార్చారు. కానీ, నేడు 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అదే పార్టీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది.

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో మొదలైన వారసత్వ యుద్ధం పార్టీని తీవ్రంగా బలహీనపరిచింది. శశికళ జైలుకు వెళ్లే ముందు ఎడప్పాడి పళనిస్వామి (EPS) ని సీఎం పీఠంపై కూర్చోబెట్టగా, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో ఈపీఎస్ ఆమెకే ఎదురుతిరిగారు. ఓ. పన్నీర్‌సెల్వం (OPS) తో కలిసి ద్వంద్వ నాయకత్వాన్ని నడిపినప్పటికీ, కాలక్రమేణా ఓపీఎస్ పక్కనబెట్టి పార్టీని పూర్తి తన గుప్పిట్లోకి తీసుకున్నారు. అధికారం ఉన్నంత కాలం పళనిస్వామి హవా నడిచింది. కానీ 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల ఓటములు ఆయన నాయకత్వంపై అసంతృప్తిని పెంచాయి.

ప్రస్తుత 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్నాడీఎంకేకు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఈ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, డీఎంకే రెండో స్థానంలో నిలిచింది. ఐదు దశాబ్దాల చరిత్ర గల అన్నాడీఎంకే కేవలం 47 సీట్లకే పరిమితమై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటూ మూడో స్థానానికి పడిపోయింది. ఈ ఓటమికి పళనిస్వామి ఏకపక్ష నిర్ణయాలే కారణమనే విమర్శలు పార్టీలోనే తీవ్రమయ్యాయి. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైపై వ్యక్తిగత ద్వేషంతో, ఈపీఎస్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఆయనను ఆ పదవి నుంచి దూరం చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల బీజేపీ ఓటు బ్యాంక్ అన్నాడీఎంకేకు దూరం కావడమే కాకుండా, కూటమి నష్టపోయింది. ఎన్నికల తర్వాత అధికారం కోసం పళనిస్వామి సాంప్రదాయ శత్రువైన డీఎంకేతో చేతులు కలిపేందుకు ప్రయత్నించారనే వార్తలు పార్టీ సీనియర్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి.

ఈ సంక్షోభ తరుణంలో జయలలిత హయాం నుండి పార్టీలో కీలక వ్యూహకర్తగా ఉన్న సీనియర్ నేత సి.వి.షణ్ముగం తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈపీఎస్ వైఖరిని నిరసిస్తూ ఆయన తన వర్గాన్ని సిద్ధం చేసుకున్నారు. తమిళనాడులో సరికొత్త రాజకీయ శక్తుగా ఎదిగిన విజయ్ TVK పార్టీకి మద్దతు ప్రకటించడం ద్వారా షణ్ముగం సంచలనం సృష్టించారు. అన్నాడీఎంకేకు చెందిన 2/3 వంతు ఎమ్మెల్యేలు పార్టీని వీడి, టీవీకేలో శాసనసభ పక్షాన్ని విలీనం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో శశికళకు వెన్నుపోటు పొడిచి పీఠం దక్కించుకున్న పళనిస్వామికి, ఇప్పుడు సొంత పార్టీ నేతలే అదే తరహా షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం.

ఎంజీఆర్, జయలలిత వంటి లెజెండ్స్ నడిపిన పార్టీ ఈరోజు నాయకత్వ పటిమ లేక విచ్ఛిన్నం కావడం ఆ పార్టీ క్యాడర్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు విజయ్ వైపు మొగ్గు చూపుతుండడంతో, అసెంబ్లీలో అన్నాడీఎంకే తన ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ తీవ్ర సంక్షోభం నుంచి పళనిస్వామి పార్టీని ఎలా కాపాడుకుంటారు, అసలు అన్నాడీఎంకేకు భవిష్యత్తు ఉందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో అన్నాడీఎంకే శకం ముగిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us