Uttar Pradesh: కాన్పూర్ అల్లర్ల కేసు.. బీజేపీ యువజన విభాగం నాయకుడు అరెస్టు

|

Jun 08, 2022 | 12:33 PM

మహమ్మద్ ప్రవక్త గురించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో బీజేపీ(BJP) యువజన విభాగం నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. బీజేపి యువమోర్చా...

Uttar Pradesh: కాన్పూర్ అల్లర్ల కేసు.. బీజేపీ యువజన విభాగం నాయకుడు అరెస్టు
Kanpur
Follow us on

మహమ్మద్ ప్రవక్త గురించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో బీజేపీ(BJP) యువజన విభాగం నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. బీజేపి యువమోర్చా జిల్లా మాజీ కార్యదర్శి హర్షిత్ శ్రీవాస్తవ.. తన పోస్టుల ద్వారా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే విధంగా వ్యవహరించారని పోలీసులు చెప్పారు. మత విద్వేషాలకు కారణమయ్యే వారిని వదిలిపెట్టబోమని పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ మీనా స్పష్టం చేశారు. గడిచిన శుక్రవారం కాన్పూర్(Kanpur) లో ప్రార్థనల తర్వాత పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లు విసిరుకున్నారు. కాన్పూర్ హింసాకాండకు సంబంధించి శ్రీవాస్తవ ట్విట్టర్‌లో వివాదాస్పద పోస్ట్ చేశారని, నగరంలో శుక్రవారం నాటి హింస తర్వాత శనివారం హనుమాన్ చాలీసాను పఠించాలని శ్రీవాస్తవ ప్రజలను కోరారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతణ్ని అరెస్టు చేసి, మంగళవారం సాయంత్రం జైలుకు పంపారు. శ్రీవాస్తవపై ఐపీసీ సెక్షన్లు 153A, 295A సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జూన్ 3 న చెలరేగిన అల్లర్ల గురించి ఫేక్ వార్తలను పోస్ట్ చేసిన వారిపై కొత్వాలి పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఇప్పటివరకు కేసు బుక్ అయిన వారి సంఖ్య 13కు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి