PM Narendra Modi – Agnipath Scheme: కేంద్రం అమల్లోకి తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతోపాటు దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు (మంగళవారం) త్రివిధ దళాల అధిపతులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల అధిపతులు ప్రత్యేకంగా ప్రధానితో భేటీ అయి అగ్నిపథ్ పథకం, దీనికి సంబంధించి జరిగిన అల్లర్లు, పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అయితే.. ముందుగా నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ప్రధాని మోడీతో భేటీ అవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త సైనిక పథకం కింద అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ కోసం త్రివిధ దళాలు ఇప్పటికే నోటిఫికేషన్‌లను ఆదివారం విడుదల చేశాయి. ఓ వైపు ఆందోళనలు, మరోవైపు నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆర్మీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అగ్నిపథ్ దరఖాస్తుదారుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చే నెలలో ప్రారంభంకానుంది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్లకు ప్రత్యేక ర్యాంక్‌ను కేటాయిస్తారని, ఇది ప్రస్తుతం ఉన్న ఇతర ర్యాంక్‌ల కంటే భిన్నంగా ఉంటుందని ఉన్నత వర్గాలు వెల్లడించాయి. నాలుగు సంవత్సరాలు సర్వీసు చేసిన వారు.. సేవా సమయంలో పొందిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా చర్యలు తీసుకంటారు. ఎన్‌రోల్ చేసే ముందు పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించబడుతుందని మిలటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి వెల్లడించారు.
అగ్నిపథ్ పథకంలో భాగంగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్‌లలో భారతదేశం అంతటా 83 ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు జరగనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..