PM Narendra Modi meets President Ram Nath Kovind: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఆయనతో ప్రధాని చర్చించినట్టు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఏయే అంశాలను రాష్ట్రపతితో చర్చించారనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. మరోవైపు ఈనెల 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయనతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా మహమ్మరి సెకండ్ వేవ్ నుంచి విముక్తి పొందిన తర్వాత తొలిసారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి.
కాగా, ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ప్రధాని ప్రాతినథ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.1500 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మోదీ.
ఈ సందర్బంగా వారణాశిలో భారీస్థాయిలో నిర్మితమైన రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రధాని ప్రారంభించారు. కన్వెన్షన్ సెంటర్‌లో రుద్రాక్ష మొక్కను నాటారు. జపాన్ సాయంతో, ఉన్నత కళానైపుణ్యంతో ఈ కేంద్రాన్ని నిర్మించినట్టు మోదీ వెల్లడించారు. వారణాసిలోని ఈ రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ సదస్సులు, సమావేశాలు నిర్వహించుకునేందుకు పర్యాటకులను, వ్యాపారవేత్తలను ఆకర్షిస్తుందని తెలిపారు. భారత్, జపాన్ స్నేహ బంధానికి ఈ కన్వెన్షన్ సెంటర్ ఓ నిదర్శనం అని పేర్కొన్నారు. 2015లో భారత్ లో పర్యటించిన అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఈ భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఉదారంగా ఆర్థికసాయం ప్రకటించారు. ఇది భారతదేశ ఆధ్మాత్మిక నగరం వారణాసికి తాము ఇస్తున్న కానుక అని అప్పుడు ప్రకటించారు. కాశీలో జరుగుతున్న అభివృద్ధి అంతా కాశీవిశ్వేశ్వరుడి ఆశీర్వాదంతోనే జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు.