Jammu and Kashmir: మంచు కొండల్లో రాజుకున్న రాజకీయ వేడి.. అఖిలపక్ష పార్టీ నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ

|

Jun 24, 2021 | 7:17 AM

ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన అప్పటినుంచి అక్కడ ఉగ్రవాద దాడులు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ రాజకీయంగా మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది.

Jammu and Kashmir: మంచు కొండల్లో రాజుకున్న రాజకీయ వేడి.. అఖిలపక్ష పార్టీ నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
Pm Modi Meeting With Jammu And Kashmir Leaders
Follow us on

PM Modi Meeting with Jammu and Kashmir Leaders: మంచు కొండల్లో రాజకీయ వేడి రాజుకుంది. జమ్ము కశ్మీర్.. పైకి సుందరంగా కనిపిస్తోన్న ఎప్పుడూ అలజడి. రాష్ట్రంగా ఉంటే భద్రత కల్పించలేమని భావించి ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. అప్పటినుంచి అక్కడ ఉగ్రవాద దాడులు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ రాజకీయంగా మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక అక్కడి స్థానిక రాజకీయ నేతలతో తొలిసారిగా కేంద్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది.

ఇవాళ జమ్ము కాశ్మీర్ భవిషత్యుత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్ములోని వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఇందుకోసం అన్ని ప్రధాన పార్టీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్దరించాలనే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. కశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీ నాయకులు 14 మందిని కేంద్రం ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి హాజరవడానికి ఒక్కొక్కరుగా నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి.

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా బుధవారం పార్టీ నేతలతో ఈ సమావేశంపై చర్చించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇలాంటి సమావేశాలు జరగడం మంచిదేనని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌ ప్రజల ఆకాంక్షలు తీర్చేలా ఈ ప్రాంత ఐక్యత, సమగ్రత కాపాడేలా చర్యలు తీసుకునే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని సమావేశానంతరం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ జమ్మూ ప్రాంత అధ్యక్షుడు దేవందర్ రాణా చెప్పారు. పీడీపీ చీఫ్‌ మెహబూబా కశ్మీర్‌కు తిరిగి స్వతంత్ర ప్రతిపత్తిని కట్టబెట్టాలని సమావేశంలో గట్టిగా డిమాండ్‌ చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. కశ్మీర్‌కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తిరిగి కట్టబెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి ఏర్పడింది.

ప్రధానితో కశ్మీర్‌ నేతల సమావేశం నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి భద్రతను కేంద్రం మరింతగా పెంచింది. 48 గంటలు హై అలర్ట్‌ ప్రకటించింది. సరిహద్దుల వెంబడి పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేసింది. కశ్మీర్‌ లోయలో ఇంటర్నెట్‌ను కూడా కట్‌ చేసే అవకాశాలున్నాయి.

ఇదిలావుంటే, 87 స్థానాలున్న జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి 2014లో ఎన్నికలు జరిగాయి. 2019 ఆగస్టు 5న ఆర్టికల్‌ 370ని రద్దు చేశారు. జమ్ముకశ్మీర్‌, లఢక్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో పరిస్థితులు చక్కబడ్డాక జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరిస్తామని మోదీ గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో హామీ ఇచ్చారు. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించి ఎన్నికలకు వెళ్లాలంటే ముందుగా నియోజక వర్గాల పునర్విభజన తప్పనిసరి. 1996లో చివరిసారిగా కశ్మీర్‌లో నియోజక వర్గాల పునర్విభజన జరిగింది. అయితే, 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 25 సీట్లు జమ్ము ప్రాంతానికి చెందినవే. తాజాగా చేపట్టాలనుకుంటున్న నియోజక వర్గాల పునర్విభజనలో జమ్ముకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ ప్రాంతంలో సీట్లు పెరిగితే రాజకీయంగా మరింత బలపడొచ్చని బీజేపీ యోచన. అయితే, ఈ వ్యూహాన్ని విపక్ష నేతలు ఎంతవరకు అంగీకరిస్తారో చూడాలి.

Read Also…  Judgement: కొడుకు బాధ్యత 18 ఏళ్లకే తీరిపోదు.. అప్పటివరకు భరించాల్సిందే.. తండ్రికి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు..