PM Narendra Modi launches Jal Jeevan Mission app: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం జల్ జీవన్ మిషన్ మొబైల్ యాప్, రాష్ట్రీయ జల్ జీవన్ కోష్ పథకాలను ప్రారంభించారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గ్రామ పంచాయతీలు, నీటి సమితులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జల జీవన్ మిషన్ మహిళల సమయాన్ని ఆదా చేయడంతోపాటు వారిని సాధికారులను చేయడం ప్రధానపాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ మిషన్ ద్వారా స్కీముల్లో జవాబుదారీతనం, పారదర్శకత తేవడం, సంబంధితులందరికీ అవగాహన కల్పించడం ఈ యాప్ లక్ష్యమని తెలిపారు. జల జీవన్ మిషన్ వల్ల మహిళలు సాధికారులవుతున్నారని మోదీ అభిప్రాయపడ్డారు.
గతంలో తాగునీటిని తేవడం కోసం మహిళలు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వచ్చేదని.. ఇప్పుడు ఆ సమస్యను దూరం చేసినట్లు తెలిపారు. ఆ సమయం, శ్రమ జల జీవన్ మిషన్ వల్ల ఆదా అవుతుందని ప్రధాని తెలిపారు. జల జీవన్ మిషన్ వల్ల తమ గ్రామాల్లో ప్రతి కుటుంబానికి పరిశుభ్రమైన తాగు నీరు లభిస్తుందంటూ సర్పంచ్‌లు, కమిటీల ప్రతినిధులు ప్రధానికి వివరించారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళలు తమ సమయాన్ని తమ పిల్లలను చదివించడానికి, ఆదాయం వచ్చే కార్యకలాపాలకు వెచ్చిస్తున్నారని.. ఇది మంచి పథకమంటూ పేర్కొన్నారు.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన కుళాయి నీటిని అందించడానికి ప్రధాన మంత్రి ఆగస్టు 15, 2019న జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించారు. మిషన్ ప్రారంభించిన సమయంలో కేవలం 3.23 కోట్ల (17%) గ్రామీణ కుటుంబాలకు మాత్రమే పంపు నీటి సరఫరా ఉండేది. ఆ తర్వాత 100శాతం మేర ఇళ్లకు పంపు కనెక్షన్లు అందించారు.
Also Read: