PM Modi: పేపర్‌ లీక్‌ వ్యవహారంపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. మరో వీడియో రిలీజ్!

పేపర్‌లీక్‌ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో రిలీజ్ చేశారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు ప్రముఖ సాంకేతిక నిపుణుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని ప్రధాని మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిలీజ్ చేసిన వీడియో పేర్కొన్నారు..

PM Modi: పేపర్‌ లీక్‌ వ్యవహారంపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. మరో వీడియో రిలీజ్!
Pm Narendra Modi

Edited By:

Updated on: Jul 26, 2026 | 7:38 PM

విద్యార్థుల భవిష్యత్తు, పేపర్ లీకేజీల వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోటీ పరీక్షల్లో పారదర్శకత పెంపు, అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం ప్రకటించారు. నందన్ నిలేకని ఆధ్వర్యంలో హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు పేపర్ లీకేజీలను పూర్తిగా అరికట్టేలా సమగ్ర సంస్కరణలు చేపట్టనున్నట్లు ప్రధాని తెలిపారు.

మోదీ ఏమన్నారో ఇక్కడ చూడండి..

విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు భారత ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన ఎవరూ తప్పించుకోలేరని, ఇప్పటికే తప్పు చేసిన వారు జైళ్లలో మగ్గుతున్నారని ఆయన హెచ్చరించారు.పరీక్షల నిర్వహణలో పారదర్శకతను మరింత పెంచేందుకు, తప్పులకు పాల్పడేవారిపై సత్వర విచారణ జరిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. ఈ నేపథ్యంలో క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత కఠినమైన చట్టాన్ని పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్లు మోదీ ప్రకటించారు.

నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

కేవలం శిక్షలే కాకుండా, రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. మన పరీక్షల విధానం మరింత పారదర్శకంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధన కోసమే ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ టాస్క్ ఫోర్స్ అందించే నివేదిక ఆధారంగా పరీక్షల వ్యవస్థ ప్రక్షాళనకు తగిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

నందన్ నిలేకని ఎవరంటే ?

నందన్ నీలేకని భారత్‌లో అత్యంత ప్రసిద్ధులైన ప్రముఖ సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్త.. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ అయిన ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకులలో ఆయన ఒకరు. అంతేకాకుండా ఆ సంస్థకు సీఈఓగా, ఛైర్మన్‌గా కూడా సేవలందించారు.. భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఆధార్ ప్రాజెక్టుకు తొలి ఛైర్మన్‌గా వ్యవహరించారు. కేంద్ర కేబినెట్ మంత్రి హోదాలో ఆయన దేశ ప్రజలందరికీ బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య (ఆధార్) అందించడంలో కీలక పాత్ర పోషించారు.

సాంకేతిక, ఆర్థిక రంగాలకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2006లో ఆయనను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ తో సత్కరించింది. అలాగే టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తులలో ఒకరిగా ఆయన్ను పేర్కొంది. దేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI) అభివృద్ధిలోనూ, విద్యారంగంలో సాంకేతికతను జోడించే కార్యక్రమాలలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

మరన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us