
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న MY–Bharat వాలంటీర్లు, యువతకు ప్రత్యేక లేఖ రాశారు. భారత ప్రజాస్వామ్య బలోపేతంలో యువత పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారత్ గుర్తింపు పొందిందని పేర్కొన్న ప్రధాని, అదే సమయంలో ప్రజాస్వామ్యానికి తల్లి దేశం భారత్ అనే గర్వకారణాన్ని గుర్తు చేశారు. శతాబ్దాలుగా చర్చ, సంభాషణ, ప్రజాభిప్రాయం భారత నాగరికతలో భాగమని అన్నారు.1951లో మొదలైన తొలి సాధారణ ఎన్నికల నుంచి 75 ఏళ్లు పూర్తైన సందర్భంలో, ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తు చేస్తూ.. “ఓటు వేయడం ఒక హక్కే కాదు, అది గొప్ప బాధ్యత కూడా” అని ప్రధాని లేఖలో పేర్కొన్నారు. ఓటరు అనేది దేశ అభివృద్ధి ప్రయాణంలో ‘భాగ్య విధాత’ అని వ్యాఖ్యానించారు. వేలికి పడే చెరగని సిరా ముద్ర ప్రజాస్వామ్యానికి గౌరవ సూచికగా నిలుస్తుందన్నారు.
తొలిసారి ఓటు వేయబోతున్న యువతకు అది జీవితంలో మర్చిపోలేని క్షణమని ప్రధాని అభివర్ణించారు. అటువంటి సందర్భాలను ఇంట్లో, నివాస సముదాయాల్లో, విద్యాసంస్థల్లో వేడుకలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాలలు, కాలేజీలు ప్రజాస్వామ్య విలువలకు పునాదులని, విద్యార్థులు ఓటర్లుగా మారే దశను ఘనంగా గుర్తించాలన్నారు. ప్రతి అర్హత కలిగిన యువకుడు, యువతి ఓటరుగా నమోదు కావాలని, విద్యాసంస్థలు ఈ దిశగా ఉద్యమ కేంద్రాలుగా మారాలన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 25న జరుపుకునే జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ కార్యక్రమాలకు సరైన వేదిక అని పేర్కొన్నారు.
భారత ఎన్నికలు ప్రపంచానికి ఒక లాజిస్టికల్ అద్భుతమైతే, మనకు మాత్రం అది ప్రజాస్వామ్య పండుగ అని ప్రధాని వ్యాఖ్యానించారు. హిమాలయాల నుంచి అండమాన్ దీవుల వరకు, అరణ్యాల నుంచి ఎడారుల వరకు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడమే భారత ప్రజాస్వామ్య బలం అని అన్నారు. మహిళల, ముఖ్యంగా యువ మహిళల భాగస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని మరింత సమగ్రంగా మారుస్తోందని పేర్కొంటూ, వారి చైతన్యం దేశానికి బలమని ప్రశంసించారు. MY–Bharat వేదికతో యువత అనుబంధం, సేవ చేయాలనే తపనకు నిదర్శనమని చెప్పారు. ఎదురు చూసే తరం కాకుండా, “Can Do Spirit”తో మార్పును తీసుకొచ్చే తరం మీరేనని ప్రధాని యువతను ఉద్దేశించి తెలిపారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా, అభివృద్ధి చెందిన, సమగ్ర, స్వావలంబన భారత్ కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని ప్రధాని తన లేఖలో పిలుపునిచ్చారు.
Becoming a voter is an occasion of celebration!
Today, on #NationalVotersDay, penned a letter to MY-Bharat volunteers on how we all must rejoice when someone around us has enrolled as a voter. pic.twitter.com/zDBfNqQ6S2
— Narendra Modi (@narendramodi) January 25, 2026