Narendra Modi: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేస్టేషన్‌లను రిడెవలప్ చేయబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆయా రైల్వే స్టేషన్లను స్మార్ట్ రైల్వే స్టేషన్లుగా మార్చేందుకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశంలోని 508 రైల్వే స్టేషన్లను అభివృద్ది చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజీపీ ప్రభుత్వం పూనుకుంది. అలాగే మొత్తం 1309 రైల్వే స్టేషన్ల రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయి. ఇక ఆయా రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనుల కోసం మోదీ ప్రభుత్వం మొత్తం 24,470 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోని పలు నగరాలను కూడా అభివృద్ధి చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇక కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న 508 రైల్వే స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ 55, రాజస్థాన్‌లలో 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, వెస్ట్ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22, గుజరాత్ 21, తెలంగాణలో 21, జార్ఖండ్‌లో 20 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 18, తమిళనాడులో 18, హర్యానాలో 15 కర్ణాటకలోని 13 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక ఆయా స్టేషన్లలో ఆధునీకరణనే దృష్టిలో ఉంచుకుని రూఫ్ ప్లాజాను నిర్మించనున్నారు. ఇంకా వెయిటింగ్ ఏరియా, లోకల్ ప్రొడక్ట్స్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇతర వస్తువుల కోసం షాపింగ్ వంటివి కూడా ఏర్పాటు కానున్నాయి.ః
శంకుస్థాపన తర్వాత ప్రధాని మోదీ ప్రసంగం..
Under Amrit Bharat Station Scheme, 508 railway stations are set to be redeveloped, leading to a significant transformation of rail infrastructure in India. https://t.co/RavZz4l9Lc
— Narendra Modi (@narendramodi) August 6, 2023
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆగస్టు ధన్యవాదాలు తెలపాల్సిన నెల అయి, రేపు(ఆగస్టు 7) దేశం మొత్తం చేనేత దినోత్సవం జరపుకుంటుందని, మరికొన్ని రోజుల్లోనే వినాయక చతుర్థి రానుందని, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే కొనుగోలు చేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆగస్టు 8న క్విట్ ఇండియా దినోత్సవం రానుందని.. అవినీతి, కుంటుంబ పాలన భారత్ నుంచి వెళ్లిపోవాలని మోదీ పేర్కొన్నారు. ఆగస్టు 14న అఖండ భారతం ముక్కలైన రోజు అని, అఖండ భారతమే లక్ష్యమని ఆ రోజు గుర్తు చేస్తుందని.. ఆగస్టు 15 మళ్లీ మనం దేశం ‘హర్ ఘర్ తిరంగా’ జరుపుకోవాలని పిలుపిచ్చారు. ఇంకా దేశంలోని ప్రతిపక్షాలు విపరీత ధోరణిని అవలంభిస్తున్నాయని, వారు అభివృద్ధి పనులు చేయడం లేదు, బీజేపీ ప్రభుత్వం చేస్తుంటూ చూడలేకపోతున్నారని ప్రధాని మోదీ ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు కురిపించారు. ఇంకా దేశ నాయకులను ప్రతిపక్షాలు గౌరవించలేదని, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో నిర్మించిన సర్దార్ వల్లభబాయ్ పటేల్ విగ్రహాన్ని వారు ఒక్కసారి కూడా సందర్శించి ఆయనకు నివాళులు అర్పించలేదని మోదీ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..