PM Modi: బిగ్ న్యూస్.. అమెరికాకు ప్రధాని మోదీ..! ట్రంప్‌తో ట్రేడ్ డీల్‌పై చర్చ..?

ట్రంప్ టారీఫ్‌లతో విరుచుకపడుతున్న వేళ ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి సమావేశం కోసం న్యూయార్క్ వెళ్లనున్న మోదీ.. అక్కడి ట్రంప్‌తో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. టారీఫ్‌ల తర్వాత మోదీ ఫస్ట్ టైమ్ అమెరికాలో పర్యటిస్తుండడంతో వాణిజ్య ఒప్పందం కుదురుందా అనే చర్చ తెరమీదకు వచ్చింది.

PM Modi: బిగ్ న్యూస్.. అమెరికాకు ప్రధాని మోదీ..! ట్రంప్‌తో ట్రేడ్ డీల్‌పై చర్చ..?
Pm Modi US Tour

Updated on: Aug 13, 2025 | 10:10 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై టారీఫ్‌లతో విరుచుకపడ్డారు. ఏకంగా 50శాతం పన్నులు విధించారు. రష్యాతో చమురు కొనుగోలు చేయడమే దీనికి కారణంగా చెప్పారు. అటు భారత్‌ సైతం ట్రంప్ తీరుపై ఫైర్ అయ్యింది. ఈ క్రమంలోనే అమెరికాకు ఝలక్ ఇస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికాతో ఆయుధాల కొనుగోల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేసింది. అంతేకాకుండా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ యూఎస్ టూర్‌ను రద్దు చేసుకున్నారు. మరోవైపు ప్రధాని మోడీ ఈ నెలాఖరున జపాన్, చైనాలో పర్యటించనున్నారు. అంతేకాకుండా రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌ను ఇండియా పర్యటనకు రావాలని ఆహ్వానించారు. ఇవి అమెరికాకు ఒక షాక్‌గా చెప్పొచ్చు. అయితే ప్రధాని మోడీ వచ్చే నెలలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. ట్రంప్ టారీఫ్ తర్వాత మోదీ యూఎస్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వచ్చే నెలలో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సదస్సు కోసం అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలను మెరుగుపరచడానికి ఈ సమావేశం కీలకం కానుంది. సెప్టెంబర్ 23 నుంచి న్యూయార్క్‌లో జరిగే ఈ సదస్సులో ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సహా పలువురు ప్రపంచ నాయకులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటనలో అంతర్జాతీయ సమస్యలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.

మోదీ ఫ్రెండ్ అంటూనే..

ట్రంప్ మోదీని చాలాసార్లు స్నేహితుడు అని అన్నారు. అయితే భారత్‌పై సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరించడంతో ఈ స్నేహ సంబంధం దెబ్బతింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ వైట్‌హౌస్‌ను సందర్శించిన తర్వాత, ఈ సమావేశం జరిగితే ఏడు నెలల్లో ఇద్దరు నాయకుల మధ్య ఇది రెండవ సమావేశం అవుతుంది. ముఖ్యంగా వ్యవసాయం, పాడి పరిశ్రమలకు సంబంధించి అమెరికా దిగుమతులను అనుమతించే విషయంలో భారత్ సుముఖంగా లేదు. దీంతో ఆగ్రహించిన ట్రంప్ భారత్‌పై 25శాతం సుంకం విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్నందున అదనంగా మరో 25శాతం సుంకం విధించారు, దీంతో మొత్తం సుంకం 50శాతానికి చేరుకుంది. ఆగస్టు 7న 25శాతం టారీఫ్ అమల్లోకి రాగా.. మిగిలిన సగం ఆగస్టు 27న అమలులోకి రానున్నాయి. ఈ గడువులోగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరు దేశాలు తీవ్రంగా చర్చలు జరుపుతున్నాయి.

ట్రంప్ – పుతిన్ భేటీ

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మానుకోవాలని అమెరికా భారతదేశంపై ఒత్తిడి తెస్తోంది. ఇది రష్యాకు ఆర్థికంగా సహాయపడుతుందని వైట్‌హౌస్ చెబుతోంది. అయితే, అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. అమెరికన్ కంపెనీలు కూడా రష్యా నుంచి యురేనియం, రసాయనాలు, ఎరువులను కొనుగోలు చేస్తున్నాయని భారత్ గుర్తుచేసింది. ఈ సమస్యను చర్చించడానికి ఆగస్టు 15న ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగే సమావేశాన్ని భారత్ నిశితంగా గమనిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..