
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో భారత్ ఈ రంగంలో అగ్రగామిగా ఎదగడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక అడుగులు వేస్తున్నారు. లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో దేశంలోని దిగ్గజ టెక్ కంపెనీల CEOలు, ఏఐ నిపుణులతో ప్రధాని ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఫిబ్రవరిలో జరగనున్న ఇండియా-AI ఇంపాక్ట్ సమ్మిట్ నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
భారతదేశం UPI ద్వారా ప్రపంచానికి తన సాంకేతిక నైపుణ్యాన్ని ఇప్పటికే నిరూపించుకుందని.. ఇప్పుడు ఏఐ రంగంలో కూడా అలాంటి విజయాలు సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో స్వదేశీ AI సాంకేతికతను ప్రోత్సహించాలని, టెక్నాలజీలో స్వావలంబన సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ వద్ద ఉన్న డేటా వైవిధ్యం, ప్రజాస్వామ్య విలువలు ప్రపంచ దేశాలకు మనపై నమ్మకాన్ని కలిగిస్తాయని, అందుకే భారత్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చాలని CEOలకు విజ్ఞప్తి చేశారు.
AI అభివృద్ధిలో కేవలం వేగం మాత్రమే కాదు.. భద్రత, పారదర్శకత కూడా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. AI దుర్వినియోగం కాకుండా దాని వినియోగం పారదర్శకంగా, న్యాయంగా ఉండేలా పటిష్టమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాలని సూచించారు. యువతలో AI నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులను కోరారు.
ఈ సమావేశంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ , విప్రో, HCL టెక్, జోహో కార్పొరేషన్, జియో ప్లాట్‌ఫామ్స్, అదానీ కనెక్స్ వంటి దిగ్గజ కంపెనీల CEOలతో పాటు.. IIT మద్రాస్, IIT బాంబే, IIIT హైదరాబాద్ నిపుణులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఈ చర్చల్లో భాగస్వాములై, ప్రభుత్వ మద్దతును వారికి వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..