ఎన్నికలపై దృష్టి, అస్సాంలో పేదలకు భూపట్టాలను పంపిణీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కోల్ కతాకు పయనం
ప్రధాని మోదీ శనివారం అస్సాంలో పేదలకు భూపట్టాలను పంపిణీ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా వీరికి భూ పట్టాల ప్రదానం జరగలేదని..
ప్రధాని మోదీ శనివారం అస్సాంలో పేదలకు భూపట్టాలను పంపిణీ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా వీరికి భూ పట్టాల ప్రదానం జరగలేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంకా లక్షలాదిమందికి వీటిని పంపిణీ చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. వీరికి తమ భూములకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు లేవని అన్నారు. ఈ సంవత్సరాంతంలో అస్సాం అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అటు- సీఏఏను రద్దు చేయాలంటూ అస్సాం అఖిల విద్యార్ధి సంఘం (ఆసు) గౌహతిలో మార్చ్ నిర్వహించింది. అస్సాం ఒప్పందం ప్రకారం ఎన్విరాన్ మెంటల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ చట్టాన్ని రద్దు చేయాలని, ఈ అగ్రిమెంట్ లోని 6 వ క్లాజుపై ఓ కమిటీ రూపొందించిన నివేదికను అమలు చేయాలని వీరు కోరుతున్నారు. ఇక అస్సాం పర్యటన ముగించుకున్న మోదీ కోల్ కతా కు బయల్దేరారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతిని పురస్కరించుకుని ఈ నగరంలో మోదీ ఓ మ్యూజియం ను ప్రారంభించనున్నారు. మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ సందర్భాన్ని తమ పార్టీ ప్రయోజనాలకు వినియోగించుకోనున్నారు. మరి మూడు నాలుగు నెలల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.