వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులు దీన్ని విరమించాలని ప్రధాని మోదీ కోరారు. ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన.. తన ఇదివరకటి (మాజీ ) ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యవసాయ సంస్కరణలపై యూ-టర్న్ తీసుకున్నారని, కానీ వాటిని తాము అమలు చేస్తున్నామని చెప్పారు. కనీస మద్దతుధర ఉంటుందని, ఇది కొనసాగుతుందని, ఎవరూ తప్పుడు సమాచారం ఇవ్వరాదని ఆయన కోరారు. మనం ముందుకు సాగాలి..వెనక్కి కాదు.. ఈ సంస్కరణల అమలుకు ఓ అవకాశం ఇవ్వాలి అని మోదీ పేర్కొన్నారు. . ప్రతి ప్రభుత్వం సంస్కరణలకు అనుకూలంగా మాట్లాడుతుంది గానీ వివిధ పార్టీలు ఇప్పుడు యూ-టర్న్ తీసుకున్నాయని ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అన్నదాతల నిరసనలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని, కానీ ఇదే సమయంలో అభివృధ్ది జరగాలంటే మార్పు అవసరమని వారికి నచ్ఛజెప్పాలని ఆయన సూచించారు. సంస్కరణలపై లోగడ మన్మోహన్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు గర్వ పడాలి.. కానీ వీటిని మేం ఇప్పుడు అమలు చేస్తున్నాం అని ఆయన అన్నారు.
దేశంలో రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమి గల రైతులు 86 శాతం మంది ఉన్నారని, అంటే వీరు సుమారు 12 కోట్ల మంది ఉండవచ్ఛునని, వీరి పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదా అని మోదీ ప్రశ్నించారు. అదేపనిగా ప్రభుత్వాన్ని విమర్శించేబదులు వాస్తవాలను గ్రహించాలని ఆయన సూచించారు.
Read More: రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం రెడీ, డిసెంబరు 3 న వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ భేటీ
Read More:రైతులతో ముగ్గురు సభ్యుల మంత్రివర్గం భేటీ, తోమర్ తో బాటు పీయూష్ గోయెల్ కూడా !