PM Modi: పాక్‌కు దిమ్మదిరిగేలా బుద్ది చెప్పారు.. భవిష్యత్తు తరానికి మీరంతా ఆదర్శం: ప్రధాని మోదీ

PM Modi: భారతీయులందరికీ.. సైనిక బలగాలు, వారి కుటుంబాలపై కృతజ్ఞత ఉందన్నారు. భారతదేశం బుద్దుడి నేల, అలాగే గురుగోవింద్‌ సింగ్‌ నేల కూడా అని వ్యాఖ్యానించారు. అణుబాంబు హెచ్చరికలను భారత సైన్యం చిత్తు చేసిందని, ఎక్కడైనా వినిపించేది ఒక్కటే భారత్‌ మాతాకి జై..

PM Modi: పాక్‌కు దిమ్మదిరిగేలా బుద్ది చెప్పారు.. భవిష్యత్తు తరానికి మీరంతా ఆదర్శం: ప్రధాని మోదీ

Updated on: May 13, 2025 | 4:12 PM

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని ఆదంపూర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. అక్కడి సైనికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత సైనికులను మోదీ అభినందించారు. అలాగే ఆపరేషన్‌ సింధూర్‌ గురించి ముచ్చటించారు. అనంతరం సైనికులనుద్దేశించి ప్రసంగించారు. మన సోదరులు, కూతుళ్ల సింధూరాన్ని తుడిచేస్తే.. ఉగ్రవాదుల ఇళ్లళ్లోకి దూరి మరీ చంపేస్తామని, భారత సైన్యం ఎదురుగా నిలిచి పోరాడిందని అన్నారు. సైన్యం ఉగ్రవాదుల స్థావరాలను మట్టిలో కలిపేసిందన్నారు. ఉగ్రవాద స్థావరాలతో పాటు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, భారతదేశంలోని సామాన్యుల జోలికి వచ్చినవారికి వినాశనమేనని అన్నారు. మన డ్రోన్లు, క్షిపణులను తలచుకుంటే పాక్‌కు నిద్రపట్టదన్నారు.

నేటి నుంచి పదేళ్ల తర్వాత భారత పరాక్రమం గుర్చి చర్చ వస్తే.. మీ అందరి గురించే చర్చించాల్సి ఉంటుందని, భవిష్యత్తు తరానికి మీరంతా సరికొత్త ప్రేరణగా నిలిచారని సైన్యాన్ని కొనియాడారు. ఈ వేదిక మీద నుంచి త్రివిధ దళాలు, బీఎస్ఎఫ్‌కు సెల్యూట్ చేస్తున్నానని, మీ పరాక్రమం కారణంగా ఆపరేషన్ సింధూర్ గురించి యావత్ ప్రపంచం చర్చించుకుంటోందన్నారు. ఈ ఆపరేషన్‌లో భారత సమాజం మొత్తం మీ వెంట నిలిచిందని, భారతీయులందరి మీకోసం ప్రార్థన చేశారన్నారు.

భారతీయులందరికీ.. సైనిక బలగాలు, వారి కుటుంబాలపై కృతజ్ఞత ఉందన్నారు. భారతదేశం బుద్దుడి నేల, అలాగే గురుగోవింద్‌ సింగ్‌ నేల కూడా అని వ్యాఖ్యానించారు. అణుబాంబు హెచ్చరికలను భారత సైన్యం చిత్తు చేసిందని, ఎక్కడైనా వినిపించేది ఒక్కటే భారత్‌ మాతాకి జై అని అన్నారు. మీరు చరిత్ర సృష్టించారు..మీ దర్శనం కోసం నేను వచ్చానని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి