AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పెళ్లికి బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక అసలు కారణాలు ఏంటో తెలుసా..?

భారతీయుల జీవితంలో బంగారం ఒక భాగం.. కానీ అదే బంగారం ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతోందా..? చమురు సెగ, యుద్ధ భయాల మధ్య భారత్ విదేశీ మారక నిల్వలు హరించుకుపోతున్న తరుణంలో ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. ఏడాది పాటు పెళ్లిళ్లకు బంగారం కొనకండి అంటూ ఆయన చేసిన పిలుపు వెనుక దాగి ఉన్న అసలు ఆర్థిక సంక్షోభం ఏంటి? అనేది తెలుసుకుందాం..

PM Modi: పెళ్లికి బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక అసలు కారణాలు ఏంటో తెలుసా..?
Why Pm Modi Asked To Stop Buying Gold
Krishna S
|

Updated on: May 11, 2026 | 10:11 AM

Share

భారతీయ సంస్కృతిలో బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అదొక సెంటిమెంట్. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు.. ఏదైనా సరే పసిడి లేనిదే పూర్తి కాదు. అయితే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన ఒక రిక్వెస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కనీసం ఏడాది పాటు పెళ్లిళ్లకు బంగారం కొనడం మానుకోవాలి అని ఆయన కోరారు. పసిడిపై ఇంతటి వ్యామోహం ఉన్న దేశంలో ప్రధాని ఇలా ఎందుకు కోరారు? దీని వెనుక ఉన్న ఆర్థిక సంక్షోభం ఏమిటి? అనే చర్చ జోరుగా నడుస్తోంది.

బంగారం vs విదేశీ మారక నిల్వలు: ఏమిటా సంబంధం..?

భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారు వినియోగదారు. ఏటా సగటున 700 నుండి 900 టన్నుల బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. మనం దిగుమతి చేసుకునే ప్రతి గ్రాము బంగారానికి అమెరికన్ డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఏటా 35-45 బిలియన్ డాలర్లు బంగారం దిగుమతులకే ఖర్చవుతాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ట్రాయ్ ఔన్సు‌కు 3,000 డాలర్లు దాటడంతో ఈ బిల్లు తడిసి మోపెడవుతోంది.

ముడి చమురు సెగ.. రూపాయిపై ఒత్తిడి

ఒకవైపు పసిడి ధరలు భగ్గుమంటుంటే, మరోవైపు మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాల వల్ల ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 126 డాలర్లకు చేరుకున్నాయి. దేశం నడవాలంటే చమురు తప్పనిసరి. మనం మన అవసరాల్లో 85శాతం దిగుమతి చేసుకుంటున్నాం. చమురుతో పోలిస్తే బంగారం కొనుగోలు అనేది ఒక ఆప్షన్ మాత్రమే..ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం కొనే బంగారాన్ని వాయిదా వేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరట లభిస్తుంది.

కరెంట్ ఖాతా లోటు అంటే ఏమిటి?

దేశం యొక్క ఆర్థిక స్కోర్‌కార్డ్‌నే కరెంట్ ఖాతా అంటారు. మనం ఎగుమతుల ద్వారా సంపాదించే దానికంటే, దిగుమతుల కోసం ఖర్చు చేసేది ఎక్కువైతే లోటు ఏర్పడుతుంది. ఈ లోటు పెరిగితే రూపాయి విలువ పడిపోయి, ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా మారుతుంది.

పెళ్లి బంగారమే ఎందుకు లక్ష్యం..?

భారతదేశంలో ఏటా సుమారు 10-12 మిలియన్ల వివాహాలు జరుగుతాయి. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే పెళ్లిళ్ల సీజన్‌లోనే దేశంలో అత్యధికంగా బంగారం అమ్ముడవుతుంది. ‘‘ఇది నిషేధం కాదు, కేవలం ఒక నైతిక విజ్ఞప్తి మాత్రమే. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పౌరులు స్వచ్ఛందంగా తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటే, అది దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుతుంది’’ అని ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

గత అనుభవాలు – ప్రత్యామ్నాయాలు

గతంలో 2013లో కూడా భారత్ ఇటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు బంగారంపై సుంకాలను పెంచి, 80:20 పథకాన్ని తెచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం భౌతిక బంగారానికి బదులుగా సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి ఆర్థిక సాధనాలను ప్రోత్సహిస్తోంది.

మార్కెట్‌పై ప్రభావం ఎలా ఉంటుంది..?

తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లపై సెంటిమెంట్ పరంగా కొంత ప్రభావం ఉండవచ్చు. అయితే భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ దృష్ట్యా, ఈ డిమాండ్ శాశ్వతంగా రద్దు కాదని, కేవలం వాయిదా మాత్రమే పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రధాని మోదీ పిలుపును ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us