Petrol and diesel price: దేశవ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ(రూ.100) దాటగా.. మరికొన్ని రాష్ట్రాల్లో రూ.100కు చేరువవుతోంది. పెరుగుతున్న ధరలను చూపిస్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఇదిలాఉంటే.. ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దేశంలోని 4 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించి.. వాహనదారులకు పెద్ద ఊరట కలిగించాయి. అయితే, త్వరలోనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనుండటమే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏ రాష్ట్రాలు పెట్రోల్, డీజీల్‌పై పన్నులు తగ్గించాయంటే..
పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గాయి. దాదాపు రూ.5 మేరకు వినియోగదారులకు ఊరట లభిస్తోంది. మొదట జనవరి 29 న రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను 38 శాతం నుంచి 36 శాతానికి తగ్గించింది. ఆ తరువాత పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌లో లీటరుకు ఒక రూపాయి తగ్గింపును మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 12న అస్సాం రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కరోనా సంక్షోభ సమయంలో పెట్రోల్, డీజిల్‌పై విధించిన 5 రూపాయల అదనపు పన్నును కూడా తొలగించింది. అదే సమయంలో, ఈశాన్య రాష్ట్రం మేఘాలయ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 7.40, డీజిల్‌పై రూ. 7.10 తగ్గించాలని నిర్ణయించింది. ఇది వినియోగదారులకు అతిపెద్ద ఊరట కలిగించే అంశం. అయితే, దీనిని మొదట లీటరుకు రూ. 2 రూపాయలు చొప్పున తగ్గించారు. ఆ తరువాత పెట్రోల్‌పై వ్యాట్ 62 శాతం నుంచి 42శాతానికి తగ్గించారు. ఇక డీజిల్ పై వ్యాట్‌ను 22.95 శాతం నుంచి 12 శాతానికి తగ్గించబడింది.
పెరుగుతున్న ధరలపై కేంద్రం స్పందన ఇదీ..
ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దాంతో కేంద్రం ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలంటూ ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. కానీ కేంద్రం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించేది లేదంటూ బలంగా నిశ్చయించుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఉత్పత్తి తగ్గడం వల్లే ఇంధన ధరలు పెరుగుతున్నాయంటూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ప్రకటించారు. అంతకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ మాట్లాడుతూ.. చమురు ధర పెరుగుదల ప్రభుత్వం నియంత్రణలో లేవని తేల్చి చెప్పారు. చమురు ధరలు తగ్గడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇలా ఒకరు తరువాత ఒకరు ప్రకటనలు చేస్తున్నారే తప్ప.. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడానికి మాత్రం నిరాకరిస్తున్నారు కేంద్ర పెద్దలు.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..
1. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.58, డీజిల్ రూ 80.97.
2. ముంబైలో పెట్రోల్ రూ .97.00, డీజిల్ రూ .88.06.
3. కోల్‌కతాలో పెట్రోల్ రూ .91.78, డీజిల్ రూ .84.56.
4. చెన్నైలో పెట్రోల్ రూ .92.59, డీజిల్ రూ .85.98.
5. నోయిడాలో పెట్రోల్ రూ .88.92, డీజిల్ రూ .81.41.
6. బెంగళూరులో పెట్రోల్ రూ .93.61, డీజిల్ 85.
7. భోపాల్‌లో పెట్రోల్ రూ .98.60, డీజిల్ రూ .89.23.
8. చంఢీఘర్‌లో పెట్రోల్ రూ .87.16, డీజిల్ రూ .80.67.
9. పాట్నాలో పెట్రోల్ రూ .92.91, డీజిల్ రూ .86.22.
10. లక్నోలో పెట్రోల్ రూ .88.86, డీజిల్ రూ .81.35.
Also read:
ఓకే అడ్రస్‌తో ఏకంగా 70 పాస్‌పోర్టులు.. తీగ లాగితే కదులుతున్న డొంక.. షాకింగ్ విషయమేంటంటే?
మీరు పీఎఫ్ ఖాతాదారులా..? ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు.. ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..!