తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం మీద హిందూ పీఠాధిపతులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఆలయాల సంపదను డీఎంకే సర్కారు దోచుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వాల అధీనంలో ఉన్న ఆలయాలలో హుండీలలో ఇకపై ఎవరు కానుకలు వేయరాదని భక్తులకు పిలపునిచ్చారు. మధురైలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సమావేశమైన పీఠాధిపతులు, అధీన గురువుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలో దేవాదాయ శాఖను రద్దు చేయాలని స్వామీజీలు డిమాండ్ చేశారు. ఆలయాల సంపద, ఆదాయంపై ప్రభుత్వ పెత్తనాన్ని ప్రశ్నించారు. శైవ క్షేత్ర ఆలయాల సంపదఫై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ద్రావిడన్ నమూనా పాలన తమకు అక్కడ లేదని, ప్రభుత్వం తమ జోలికి రాకుండా ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు. తాము రాజకీయాలు చేస్తే పరిస్థితి మారిపోతుందని స్వామీజీలు స్టాలిన్ ప్రభుత్వానని హెచ్చరించారు.
కాగా, మధురై అధీనం ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు తప్పుపట్టారు. ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానులని, కావాలనే కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆస్తికులు, నాస్తికులు కలిసి అభివృద్ధి కోసం ముందుకు వెళ్లడమే ద్రావిడన్ మోడల్ పరిపాలన అని శేఖర్ బాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. హిందూ పీఠాధిపతులు, దీక్షితులతో దేవాదాయ శాఖ చర్చలు జరుపుతోందని తెలిపారు. చిదంబరం నటరాజ స్వామి ఆలయ సంపదని తప్పకుండా లెక్కిస్తామని స్పష్టం చేశారు.