పఠాన్‌కోట్‌లో ఆర్మీ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌.. గాల్లోకి ఎగిరిన కాసేపటికే తలెత్తిన సాంకేతిక లోపం!

గుజరాల్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటన జరిగి 24 గంటలు కూడా కాకముందే పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలో ఆర్మీ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పఠాన్‌ కోట్‌ వైమానికి కేంద్రం నుంచి బయల్దేరిన ఇండియన్ ఆర్మీకి చెందిన అపాచీ అటాక్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. గమనించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో హెలికాఫ్టర్ సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

పఠాన్‌కోట్‌లో ఆర్మీ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌.. గాల్లోకి ఎగిరిన కాసేపటికే తలెత్తిన సాంకేతిక లోపం!
Apache Helicopter

Updated on: Jun 13, 2025 | 3:38 PM

ఇటీవల కాలంలో గగనతలంలో జరుగుతున్న ప్రమాదాలు ఎక్కువయ్యాయి. గురువారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ సమీపంలో ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలి 100 మందికిపైగా మరణించిన ఘటన జరిగి 24 గంటలు కూడా కాకముందే పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలో ఆర్మీ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర కలకలం రేపింది. పఠాన్‌కోట్ జిల్లాలోని నంగల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే హాలెడ్ గ్రామంలో శుక్రవారం ఉదయం భారత వైమానిక దళానికి చెందిన అపాచీ అటాక్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తోంది.

అయితే, శుక్రవారం ఉదయం పఠాన్‌కోట్‌లోని వైమానిక దళ కేంద్రం నుండి ఆర్మీకి సంబంధించిన అపాచీ అటాక్ హెలికాప్టర్ బయలుదేరింది. అయితే హెలికాప్టర్ గాలిలో ఎగిరిన కాసేపటికే సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దాన్ని గమనించి అప్రమత్తమై పైటెట్ ముందుజాగ్రత్తగా.. వెంటనే హెలికాప్టర్‌ను బహిరంగ ప్రదేశంలో సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు. హెలికాప్టర్ దిగుతున్న దృశ్యాలను చూసిన స్థానిక గ్రామస్తులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

హెలికాప్టర్ ల్యాండ్‌ అయిన వెంటనే పైలట్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. ఇక పైలట్‌ ఇచ్చిన సమాచారంతో తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్న రక్షణ, పోలీసు సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. పైలట్‌ అప్రమత్తతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాకిని గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.