Robbery Live Video: పట్టపగలే గన్‌తో ఎంట్రీ.. నిమిషాల్లో జ్యువెలరీ షాప్ లూటీ!
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో పట్టపగలు జరిగిన సాయుధ దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. దహను పట్టణంలోని ఓ ప్రముఖ నగల దుకాణంలోకి ముగ్గురు ముసుగు ధరించిన దొంగలు తుపాకులతో చొరబడి, గన్ పాయింట్‌లో బెదిరించి భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో పట్టపగలు జరిగిన సాయుధ దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. దహను పట్టణంలోని ఓ ప్రముఖ నగల దుకాణంలోకి ముగ్గురు ముసుగు ధరించిన దొంగలు తుపాకులతో చొరబడి, గన్ పాయింట్‌లో బెదిరించి భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పోలీసుల వివరాల ప్రకారం, దహను పట్టణంలోని ఇరానీ నగర్ ప్రాంతంలో ఉన్న ‘లక్ష్మీ జ్యువెలర్స్’ దుకాణాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, చేతుల్లో తుపాకులు, ఇతర ఆయుధాలతో దుకాణంలోకి ప్రవేశించారు. అనంతరం దుకాణ యజమాని, సిబ్బందిని ఆయుధాలతో బెదిరించి భయాందోళనకు గురిచేశారు.
కొద్ది నిమిషాల్లోనే దుకాణంలోని బంగారు ఆభరణాలను సేకరించిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దోపిడీ మొత్తం దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. అదే సమయంలో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో దుండగుల కదలికలను చిత్రీకరించడంతో, ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
పట్టపగలు జరిగిన ఈ ఘటనతో దహను ప్రాంతంలోని వ్యాపారులు, ముఖ్యంగా నగల వ్యాపారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే దహను పోలీసులు, పాల్ఘర్ లోకల్ క్రైమ్ బ్రాంచ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించాయి. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ వీడియోలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల గుర్తింపు, వారి కదలికలను తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పరారీలో ఉన్న దోపిడీ ముఠాను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇటీవల వరుసగా జరుగుతున్న ఇలాంటి సాయుధ దోపిడీల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగల దుకాణాల వద్ద భద్రతా చర్యలను మరింత పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
