AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terror Attack: ఐదు రోజుల క్రితమే నావీ ఆఫీసర్ పెళ్లి.. నవ వధువు కళ్ళ ఎదుటే ఉగ్రదాడిలో మృతి..

మంచు దుప్పటి కప్పుకుని అందమైన ప్రకృతితో భూతల స్వర్గం అయిన కశ్మీర్ లో సరదాగా కొన్ని రోజులు గడపాలని వెళ్ళిన పర్యాటకులు తెలియదు.. తాము ఉగ్రమూకల దాడికి బలవుతామని.. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇప్పటి వరకూ 30 మంది మృతి చెందారు. ఆ మృతుల్లో హర్యానాకి చెందిన ఒక నేవీ అధికారి కూడా ఉన్నారు. అతనికి వివాహం జరిగి కేవలం ఐదు రోజులు అయినట్లు తెలుస్తోంది.

Pahalgam Terror Attack: ఐదు రోజుల క్రితమే నావీ ఆఫీసర్ పెళ్లి.. నవ వధువు కళ్ళ ఎదుటే ఉగ్రదాడిలో మృతి..
Vinay Narwal Navy Officer
Surya Kala
|

Updated on: Apr 23, 2025 | 11:45 AM

Share

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 30 మంది మరణించారు. అనేకమంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ మృతుల్లో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 26 ఏళ్ల భారత నావికాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. వినయ్ నర్వాల్ వివాహం జరిగి కేవలం ఐదు రోజులు మాత్రమే అయినట్లు తెలుస్తోంది. వివాహం కోసం సెలవులో ఉన్న వినయ్ తన భార్యతో కలిసి కాశ్మీర్‌లోని అందాలను చూస్తూ నవ జీవితాన్ని గడపడానికి వెళ్ళాడు.

26ఏళ్ల వినయ్ నార్వాల్ రెండేళ్ల క్రితమే నేవీలో చేరారు. కొచ్చిలో పోస్టింగ్ తీసుకున్న వినయ్ అక్కడే తన ఉద్యోగ విధులను నిర్వహిస్తున్నారు. వినయ్ ఏప్రిల్ 16నుంచి వివాహం కోసం.. సెలవులో ఉన్నట్లు రక్షణ అధికారులు ధృవీకరించారు. వినయ్ పెళ్లి, వివాహ రిసెప్షన్ ఏప్రిల్ 19న జరిగింది.

కాళ్ళ పారాణి అయినా అరక ముందే వినయ్ ఉగ్రదాడిలో మరణించడం ఆయన కుటుంబ సభ్యులను, రక్షణ వ్యవస్థతో పాటు యావత్ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వినయ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇరుగు పొరుగువారు, స్థానికులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. చాలామంది వినయ్ నార్వాల్ ను ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ అధికారిగా అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి

వినయ్ నార్వాల్ కి గ్రామానికి చెందిన నరేష్ బన్సల్ ANIతో మాట్లాడుతూ, “వినయ్ నార్వాల్ పెళ్లి 4 రోజుల క్రితమే జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. అతన్ని ఉగ్రవాదులు దాడిలో అక్కడికక్కడే మరణించాడని మాకు సమాచారం అందింది. దీంతో పెళ్లి జరిగిన ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొందని చెప్పారు. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విస్తృత ఆగ్రహాన్ని కలిగిస్తోంది. రాజకీయ నాయకుల సహా పలువురు సెలబ్రేటీలు, క్రికెటర్లు ఈ దాడిని ఖండించారు.

మంగళవారం జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిరసనగా జమ్మూ కాశ్మీర్ నివాసితులు రాష్ట్రంలోని అనేక ప్రదేశాలలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. బారాముల్లా, శ్రీనగర్, పూంచ్, కుప్వారాలలో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించగా, జమ్మూలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలోని అఖూర్ ప్రాంతంలోని ఖోడ్ గ్రామంలో స్థానికులు కూడా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.

ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిలో మహారాష్ట్రకు చెందిన ఐదుగురు పర్యాటకులు కూడా ప్రాణాలు కోల్పోయారని ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో తెలిపింది. కశ్మీర్ లో చిక్కుకున్న మహారాష్ట్ర పర్యాటకులను తరలించడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడును అభ్యర్థించారు.

ఈ విజ్ఞప్తికి స్పందిస్తూ, చిక్కుకుపోయిన వ్యక్తుల జాబితాను మంత్రిత్వ శాఖకు పంచుకున్న తర్వాత, ప్రాధాన్యత క్రమంలో వారిని ముంబైకి రవాణా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి షిండేకు హామీ ఇచ్చారు.

దాడికి పాల్పడిన వారిని పట్టుకోవడానికి భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అనంత్‌నాగ్‌లోని పహల్గామ్‌లోని బైస్రాన్ జనరల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలపై నిఘా ఉంచాలని కూడా ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..