COVID-19 vaccine: రాష్ట్రాల దగ్గర అందుబాటులో కోటికిపైగా వ్యాక్సిన్లు.. కీలక ప్రకటన చేసిన కేంద్రం

Central Government - Coronavirus vaccine: దేశవ్యాప్తంగా మే 1 నుంచి 18ఏళ్లకు పైబడిన వారందరికీ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 14.5 కోట్లకు

COVID-19 vaccine: రాష్ట్రాల దగ్గర అందుబాటులో కోటికిపైగా వ్యాక్సిన్లు.. కీలక ప్రకటన చేసిన కేంద్రం
COVID-19 vaccine

Updated on: Apr 28, 2021 | 3:57 PM

Central Government – Coronavirus vaccine: దేశవ్యాప్తంగా మే 1 నుంచి 18ఏళ్లకు పైబడిన వారందరికీ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 14.5 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఇటీవల వ్యాక్సిన్ల స్టాక్ తమ వద్ద అయిపోయాయని.. కేంద్రం వెంటనే పంపించాలంటూ పలు రాష్ట్రాలు కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై సరిపడా వ్యాక్సిన్లను రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. అయితే.. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోటి డోసులకుపైగా కోవిడ్-19 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం బుధవారం ప్రకటించింది. రాబోయే మూడు రోజుల్లో 57 లక్షలకుపైగా మోతాదులను పంపనున్నట్లు వెల్లడించింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్‌, గుజరాత్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల వద్ద టీకాల నిల్వలు అత్యధికంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు దాదాపు 15.9 కోట్ల మోతాదులను రాష్ట్రాలకు, యూటీలకు ఉచితంగా అందించామని.. ఇందులో వృథా సహా 14.8 కోట్ల డోసులను వినియోగించినట్లు పేర్కొంది.

టీకా డోసులు లేకపోవడం వల్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిగా ప్రభావితమైనట్లు మహారాష్ట్రకు చెందిన కొందరు అధికారులు మీడియాకు వివరించారు. ఈ వార్తలపై కేంద్రం వివరణ ఇచ్చింది. ఏప్రిల్‌ 28న ఉదయం 8 గంటల వరకు మహారాష్ట్ర 1,58,62,470 డోసులు అందుకుందని, ఇందులో 0.22శాతం వృథా అవగా.. 1,53,56,151 డోసులు వినియోగించిందని కేంద్రం పేర్కొంది. ఇంకా అర్హత ఉన్న వ్యక్తులకు టీకాలు వేసేందుకు రాష్ట్రం దగ్గర 5,06,319 డోసులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. రాబోయే మూడు రోజుల్లో మహారాష్ట్రకు మరో ఐదు లక్షల డోసులు పంపించనున్నట్లు పేర్కొంది. కాగా.. మరో మూడు రోజుల్లో భారీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుండటంతో ప్రభుత్వం అప్రమత్తమై వ్యాక్సిన్ల లోటు లేకుండా చర్యలు తీసుకుంటోంది.

Also Read:

Covid Vaccine: రెండ్రోజుల్లో అతిపెద్ద వ్యాక్సిన్ వార్.. డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ సాధ్యమేనా?

మే 2 తర్వాత కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం