అన్నాడీఎంకేలో చిన్నమ్మ చిచ్చు… పళని – పన్నీర్ వర్గీయుల మధ్య పోస్టర్ వార్

|

Jun 11, 2021 | 9:28 AM

AIADMK - VK Sasikala: అన్నాడీఎంకే నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో వీకే శశికళ ఉన్నారన్న కథనాల నేపథ్యంలో ఈ నెల 14న జరగనున్న ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

అన్నాడీఎంకేలో చిన్నమ్మ చిచ్చు... పళని - పన్నీర్ వర్గీయుల మధ్య పోస్టర్ వార్
Sasikala
Follow us on

త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానంటూ వీకే శశికళ(VK Sasikala) చేస్తున్న ప్రకటనలు అన్నాడీఎంకే‌(AIADMK)లో చిచ్చురేపుతోంది. అన్నాడీఎంకే‌పై మళ్లీ పట్టు సాధించే వ్యూహంతో ఆ పార్టీ శ్రేణులతో ప్రతిరోజూ శశికళ ఫోన్‌లో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డులు అన్నాడీఎంకే వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా గురువారంనాడు ఓ అన్నాడీఎంకే నేతతో శశికళ ఫోన్‌లో మాట్లాడుతున్న మరో ఆడియో రికార్డు విడుదలయ్యింది. అన్నాడీఎంకే నుంచి తనను వేరుచేయలేరంటూ ఆ రికార్డుల్లో ఆమె పేర్కొన్నారు. గతంలో విడుదలైన ఆడియో రికార్డుల్లో ఆమె అన్నాడీఎంకే పార్టీని నేరుగా ఎక్కడా ప్రస్తావించకుండా కట్చి(పార్టీ) అంటూ సంబోధించారు. తాజా ఆడియో టేపులో ఆమె సూటిగా అన్నాడీఎంకే పేరును ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే శాసనసభాపక్షం ఈ నెల 14న సమావేశం కానుంది. అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, విప్‌లను ఎన్నుకునేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అటు అన్నాడీఎంకే నేతలు, ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకుందుకు శశికళ వర్గం ప్రయత్నిస్తోందన్న కథనాల నేపథ్యంలో ఈ సమావేశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

అటు అన్నాడీఎంకే అగ్రనేతలు ఎడపాటి పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య అంతా సవ్యంగా లేదన్న ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేరూర్చేలా వారిద్దరి వర్గీయులు తిరునెల్వేలి జిల్లాలో పోస్టర్ వార్‌కు దిగారు. ఎవరికి మద్ధతుగా వారు పోటాపోటీగా భారీ పోస్టర్లు ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా నెల క్రితం పళనిస్వామి ఎన్నికయ్యారు. అయితే శాసనసభాపక్ష ఉపనేత, విప్ ఎంపిక విషయంలో ఆ పార్టీ అగ్రనేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య విబేధాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. శాసనసభాపక్ష ఉపనేత పదవిని తీసుకునేందుకు పన్నీర్ సెల్వం సుముఖంగా లేరని తెలుస్తోంది. అసెంబ్లీలో విప్ చాలా కీలకమైన పదవి కావడంతో ఆ పదవిని తన మద్ధతుదారుడికి ఇవ్వాలని పన్నీర్ సెల్వం పట్టుబడుతున్నట్లు సమాచారం.

ఈ రెండు పదవుల విషయంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఏర్పడిన భిన్నాభిప్రాయాలు ఎక్కడికి దారితీస్తుందోనని తమిళ రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. పార్టీలో పన్నీర్ సెల్వం ప్రాధాన్యత తగ్గుతోందని ఆయన మద్ధతుదారులు అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితుల కారణంగా పన్నీర్ సెల్వం వర్గం శశికళ వైపు మొగ్గే అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే అన్నాడీఎంకే‌పై పట్టు సాధించేందుకు శశికళ వర్గం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు పలువురు  మాజీ మంత్రులు, అన్నాడీఎంకే సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. పార్టీ నేతలు ఎవరూ చేజారిపోకుండా తమ జిల్లాల్లోని పార్టీ నేతలతో వారు సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి..

పోలవరం ప్రాజెక్టు తొలి ఫలితానికి అంకురార్పణ.. డెల్టాకు స్పిల్ వే మీదుగా కాసేపట్లో గోదావరి నీటి విడుదల

మద్యం మత్తులో నడిరోడ్డుపై యువకులు హల్ చల్.. దారినపోయే వారిపై రాళ్లతో దాడి..పలువురికి తీవ్ర గాయాలు!