Corona Vaccine: కరోనా టీకా సీలు తెరిస్తే ఆ సమయంలోగా వాడేయాలి.. లేదంటే నిర్వీర్యమే.. వైద్య నిపుణుల సూచనలు

|

Jan 20, 2021 | 7:38 PM

Corona Vaccine:  భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమ నిర్దేశిత మార్గదర్శకాలను పాటిస్తూ వ్యాక్సినేషన్‌ కొనసాగిస్తున్నారు..

Corona Vaccine: కరోనా టీకా సీలు తెరిస్తే ఆ సమయంలోగా వాడేయాలి.. లేదంటే నిర్వీర్యమే.. వైద్య నిపుణుల సూచనలు
Follow us on

Corona Vaccine:  భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమ నిర్దేశిత మార్గదర్శకాలను పాటిస్తూ వ్యాక్సినేషన్‌ కొనసాగిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో కరోనా టీకా వాడకంపై వైద్య నిపుణులు పలు సూచనలు, సలహాలు చేస్తున్నారు. ఒకసారి టీకా సీలు తెరిచిన తర్వాత నాలుగు గంటల్లోగా ఉపయోగించాలని వారు సూచించారు. ఒక వేళ ఆ సమయంలోగా వాడకుంటే టీకా నిర్వీర్యం అవుతుందని, వాటిని వాడకూడదని స్పష్టం చేశారు. ప్రతి 5ఎంఎల్‌ వ్యాక్సిన్‌ సీసా 10 డోసులను కలిగి ఉంటుంది. ఒకసారి దీనిని తెరిచిన అనంతరం అందులో ఉండే పది డోసులను నాలుగు గంటల్లోగా ఉపయోగించాలి. ఈ వ్యవధిలోగా వినియోగించుకోకుంటే డోసులు వ్యర్థమైనట్లే. వాటిని ఉపయోగించకుండా నాశనం చేయాలి అని ఢిల్లీ రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అధికార ప్రతినిధి ఛవీ గుప్తా తెలిపారు.

తమ వద్ద తొలి రోజు 45 మందికి టీకా ఇచ్చాము. ఈ క్రమంలో నాలుగు సీసాలు పూర్తిగా వినియోగమయ్యాయి. ఇక ఐదో దానిలో ఐదు డోసులు వాడిన అనంతరం మిగిలిన ఐదు నిరూపయోగమయ్యాయి అని ఆమె తెలిపారు. అయితే ఇలా వృథా కావడం అనేది జరుగుతుంటుందని, ఇలాంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 10 శాతం టీకాలు అధికంగా అందజేస్తుందని అన్నారు. ఢిల్లీ రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి దేశంలో వ్యాక్సిన్‌ నిల్వకు కేంద్ర స్థానంగా వినియోగిస్తున్నారు.

Also Read: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా.. మందుబాబులూ తస్మాత్ జాగ్రత్త.! అప్పటివరకు నో ఆల్కహాల్..