Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటన కారణమదే.. సంచలన వివరాలు వెల్లడించిన విచారణ కమిటీ..
ఒడిశా రైలు దుర్ఘటనకు గల కారణాలను విచారణ కమిటీ వెల్లడించింది. రాంగ్ సిగ్నలింగ్ వల్లే ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుందని తేల్చింది. అయితే.. అనేక స్థాయిల్లో లోపాలు ఉన్నట్టు రైల్వే సేఫ్టీ కమిషన్ గుర్తించడం కలకలం రేపుతోంది. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషన్ స్పష్టం చేసింది.

ఒడిశా రైలు దుర్ఘటనకు గల కారణాలను విచారణ కమిటీ వెల్లడించింది. రాంగ్ సిగ్నలింగ్ వల్లే ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుందని తేల్చింది. అయితే.. అనేక స్థాయిల్లో లోపాలు ఉన్నట్టు రైల్వే సేఫ్టీ కమిషన్ గుర్తించడం కలకలం రేపుతోంది. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషన్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని నివేదికలో పేర్కొంది. జూన్ 2వ తేదీన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు ట్రైన్స్ ఢీకొన్న ఘటనలో 293 మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలను త్చేల్చేందుకు రైల్వే శాఖ విచారణ కమిటీ వేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సీబీఐ విచారణ కొనసాగుతుండగానే.. దుర్ఘటనపై విచారణ జరిపిన రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సంచలన వివరాలు వెల్లడించింది. ఉద్యోగుల అజాగ్రత్త వల్లే 3 రైళ్లు ఢీకొని ఘోర దుర్ఘటన చోటుచేసుకుందని నివేదికలో పేర్కొన్నారు.
గతంలోనూ ఇలాంటి ఘోరాలే జరిగాయని, ఆ పొరపాట్ల నుంచి నుంచి పాఠాలు నేర్చుకొని ఉంటే ఇప్పుడీ ట్రైన్ ప్రమాదం జరిగేది కాదని అభిప్రాయపడింది కమిషన్. కాగా, రాంగ్ వైరింగ్, రాంగ్ కేబుల్ కారణంగా 2022 మే 16వ తేదీన కూడా ఇలాంటి దుర్ఘటనే ఖరగ్‌పూర్ డివిజన్‌లో చోటుచేసుకుందని నివేదికలో పేర్కొన్నారు. అప్పుడే దాన్ని సరిచేసే చర్యలు చేపట్టి రాంగ్ వైరింగ్ సమస్యను పరిష్కరించి ఉంటే ఒడిశా దుర్ఘటన జరిగి ఉండేది కాదంది. సిగ్నలింగ్, సర్క్యూట్ వ్యవస్థలో లోపాల కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చింది.
ఇప్పటికైనా.. సిగ్నలింగ్ సర్క్యూట్‌లు, పనితీరును తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా బృందాన్ని నియమించాలని సూచించింది రైల్వే సేఫ్టీ కమిషన్. ఇక.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లు అనూహ్య రీతిలో ఢీకొని పెను విషాదం సృష్టించాయి. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై కుట్ర కోణం ఆరోపణలు రావడంతో రైల్వే బోర్డు సిఫారసు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. అదే సమయంలో రైల్వే సేఫ్టీ కమిషన్ కూడా విచారణ జరిపి, తన నివేదికను రైల్వే బోర్డుకు అందించింది. నివేదికలో ప్రమాదానికి గల కారణాలను క్షుణ్ణంగా వివరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




