వృద్ధాప్య పెన్షన్ కోసం పండుటాకులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒడిశాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన చాలా మందిని కలచివేస్తోంది. ఒడిశా నబరంగపుర్లో పింఛను కోసం ఓ వృద్ధురాలు పడుతున్న అవస్థలు.. అందరినీ చలింపచేశాయి. సూర్య హరిజన్ అనే 70 ఏళ్ల వృద్ధురాలు పింఛన్ కోసం మండే ఎండలో విరిగిన కుర్చీ సాయంతో అనేక కిలోమీటర్లు ప్రయాణించింది. ఆమె కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేవు. విరిగిన కుర్చీని ఆసరాగా చేసుకుని ఆ వృద్ధురాలు చాలా దూరం ప్రయాణించి వెళ్లింది.
అయితే, ఆపసోపాలు పడుతూ అంత దూరం వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఆమె చేతి వేలిముద్రలు సరిగా పడట్లేదు. అందుకే బ్యాంక్ అధికారులు ఆమెకు పెన్షన్ ఇవ్వలేదు. అస్థిపంజరంలా ఉన్న వృద్ధురాలు మండుటెండలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. నిస్సహాయ స్థితిలో ఉన్న బానుగూడ పంచాయతీకి చెందిన సూర్య హరిజన్ను ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..