- Telugu News Photo Gallery Business photos What is Akshaya Tritiya and whay buy gold on Akshaya Tritiya details here Telugu Gold News
Akshaya Tritiya: అక్షయ తృతియకు.. బంగారానికి ఏంటా సంబంధం.? అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి.?
అక్షయ తృతియ.. ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది బంగారం. ఈ పండగకు బంగారానికి అంతగా ముడిపెట్టేశారు మన మార్కెటింగ్ నిపుణులు. అందుకే మన ప్రమేయం లేకుండానే మనకు కనీసం నెల రోజుల ముందు నుంచి ఈ పర్వదినాన్ని గుర్తు చేస్తూ..
Updated on: Apr 21, 2023 | 9:07 AM

ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది బంగారం. ఈ పండగకు బంగారానికి అంతగా ముడిపెట్టేశారు మన మార్కెటింగ్ నిపుణులు. అందుకే మన ప్రమేయం లేకుండానే మనకు కనీసం నెల రోజుల ముందు నుంచి ఈ పర్వదినాన్ని గుర్తు చేస్తూ... ఆఫర్ల వల వేస్తూ... పసిడి ప్రియుల్ని ఎంత వరకు వీలైతే అంత వరకు ఆకర్షించేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి ఉత్తరాది రాష్ట్రాల్లో తప్ప దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10-15 ఏళ్ల క్రితం వరకు ఈ పర్వదినానికి పెద్దగా ప్రచారం ఉండేది కాదు. కానీ ప్రసార మాధ్యమాలు పెరిగిన తర్వాత... ఇంకా చెప్పాలంటే కార్పొరేట్ సంస్థలు పసిడి వర్తకంలోకి ప్రవేశించిన తర్వాత.. అక్షయ తృతియ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం, ఆపై గోల్డ్ షాపులు జనంతో కిక్కిరిసిపోవడం సర్వ సాధారణమైపోయింది. అక్షయ తృతియ ప్రాధాన్యం గురించి.... అవకాశం వచ్చిన ప్రతి సారి అన్నీ ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో వస్తూనే ఉంటోంది కనుక.. దాని గురించి ఇప్పుడు పెద్దగా ప్రస్తావించడం లేదు.

అయితే సింపుల్‌గా చెప్పాలంటే ఈ పర్వ దినం పేరులోనే దాని అర్థం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అక్షయం అంటే క్షయం కానిది.. అంటే ఎప్పటికీ తరిగిపోనిది. అందుకే ఆ రోజున మంచి పనులు చెయ్యమంటారు. ఆ మంచి ఎప్పటికీ తరిగిపోనిదిగా ఉంటుంది కనుక... దాని వల్ల వచ్చే ఫలితాలు కచ్చితంగా శుభాలే అవుతాయన్నది ఈ పర్వ దినం పరమార్థం. సరిగ్గా ఇదే అర్థాన్ని తమ గోల్డ్ బిజినెస్‌కి లింక్ చేసేశారు మార్కెటింగ్ నిపుణులు. బంగారం అంటే భారతీయులకు ఎలాగూ మక్కువ ఎక్కువే కాబట్టి... బంగారం కొనడం శుభానికి ప్రతీకగానే మన వాళ్లు భావిస్తారు కాబట్టి... అన్నింటికీ మించి బంగారం ఎప్పటికీ తరిగిపోనిదిగా ఉండిపోవాలని ఆడవాళ్లంతా ఆశిస్తారు కాబట్టి... అక్షయ తృతియనాడు పుత్తడిని కొంటే కలిసొస్తుందన్న ప్రచారం కల్పించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి కనుక... కొనడం వల్ల నష్టం కన్నా లాభమే ఎక్కువ. అందుకే మార్కెట్ నిపుణులు కూడా భరోసా ఇచ్చే బంగారం విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. సో... మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే... వాస్తవం ఏదైనా సరే... అక్షయ తృతియ రోజు బంగారం కొనాలన్న ప్రచారం కాస్త... బలమైన నమ్మకంగా మారిపోయింది. అలా అటు అమ్మేవాళ్లకు.. ఇటు కొనే వాళ్లకు కనక వర్షం కురిపించే రోజు ఇది అని చెప్పొచ్చు. సరే... ఎన్ని రకాలుగా విమర్శించినా... బిజినెస్ ట్రిక్స్ అంటూ ఎద్దేవా చేసినా.... అక్షయ తృతియ విషయంలో ఇప్పటికిప్పుడు మనలో పాతుకుపోయిన నమ్మకాల్ని మార్చేయలేం. కనుక బంగారం కొనాలని డిసైడ్ అయిపోయిన వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓ సారి చూద్దాం.

1.పసిడి ధరలు బంగారం కొనుగోలు చేసే ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది దాని ధర. బంగారం ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. స్వల్పకాలంలోనే చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి. అంతర్జాతీయంగా తలెత్తే మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా బంగారం ధర మారుతుంటుంది. అలాగే దేశం మొత్తం కూడా ధర ఒకేలా ఉండదు. ఒక్కో నగరంలో ఒక్కోలా ఉండొచ్చు. కనుక గోల్డ్ కొనే ముందు బంగారం ధరను ఒకట్రెండు షాపుల్లో ఆరా తీయాలి. నమ్మదగ్గ వెబ్‌సైట్లలో కూడా రేట్లు తనిఖీ చేయొచ్చు.

2.స్వచ్ఛత బంగారం కొనేటప్పుడు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం దాని స్వచ్ఛత. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారాన్ని ప్యూర్ గోల్డ్‌గా పరిగణిస్తారు. సాధారణంగా మనం కొనుగోలు చేసే బంగారు ఆభరణాలన్నీ 22 క్యారెట్లవి. కాబట్టి ధరను చూసేటప్పుడు 22 క్యారెట్ల బంగారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కావాలంటే మాత్రం కాయిన్లు, బార్ల రూపంలో కొనుక్కోవాల్సి ఉంటుంది.

3.మేకింగ్ చార్జీలు దుకాణాదారుడు, ఆభరణం డిజైన్, తయారుచేసే వ్యక్తుల ఆధారంగా తయారీ రుసుములు మారుతూ ఉంటాయి. బంగారాన్ని కాయిన్ రూపంలో కొనుగోలు చేసిన అనంతరం ఆభరణంగా తయారు చేసేందుకు 8 నుంచి 16 శాతం వరకు మేకింగ్ చార్జీలు ఉంటాయి. ఇది కొంత తయారీ రుసుము గానూ, మరికొంత తరుగు రూపంలో మీ నుంచి వసూలు చేస్తారు. బంగారం ఆభరణంలో తయారీలో కొంత బంగారం వృథా అవుతుంది. దీన్ని తరుగు లేదా వేస్టేజ్ అంటారు. ఆభరణం తయారీకి వసూలు చేసే మొత్తాన్ని మజూరీ అంటారు. ఇది ఆభరణాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది.

4.హాల్ మార్కింగ్ ఆభరణాలను అచ్చంగా బంగారంతోనే తయారు చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఇతర లోహాలను బంగారంతో కలిపి ఆభరణాలను తయారు చేస్తారు. ఈ లోహాలు ఎంత వరకు కలిపారన్న దానిపై ఆ నగ స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. హాల్‌మార్క్ గుర్తు బంగారు ఆభరణాల స్వచ్ఛతను తెలియజేస్తుంది. గోల్డ్ ఆర్నమెంట్స్ కొనే సమయంలో వినియోగదారుడు మోసపోకుండా భారత ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)ను ఏర్పాటు చేసింది. మీరు కొనుగోలు చేసిన బంగారు ఆభరణం బీఐఎస్ హాల్ మార్క్ కలిగి ఉండాలి. ఏప్రిల్ 1 నుంచి పసిడి ఆభరణాలను 6 అంకెల HUID (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్)తో విక్రయించడాన్ని BIS తప్పనిసరి చేసింది. ఒకవేళ మీకు బంగారు హాల్‌మార్క్ గురించి ఫిర్యాదులు ఉంటే BISను నేరుగా సంప్రదించవచ్చు.

5.ఎలా కొనాలి ? ఇదేం ప్రశ్న... అని అనుకోవచ్చు. బంగారం కావాలంటే బంగారం షాపుకెళ్లి కొనుక్కుంటాం అనుకోవచ్చు. ఆభరణాల కొనుక్కోవాలంటే ఇప్పుడు షాపులకి వెళ్లే కొనుక్కోవాల్సిన పని లేదు. చాలా కార్పొరేట్ దుకాణాలు ఆన్ లైన్లో కూడా ఆభరణాలను విక్రయిస్తున్నాయి. ఇక కాయిన్లు లేదా బార్ల రూపంలో బంగారం కొనుక్కోవాలంటే అందుకోసం కొన్ని వెబ్ సైట్స్, MMTC వంటి ఇతర మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. గోల్డ్ కాయిన్‌లను కొనుగోలు చేయాలంటే బ్యాంకులను కూడా సంప్రదించొచ్చు. చాలా బ్యాంకులు వేరు వేరు విలువలు కలిగిన 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్లను విక్రయిస్తున్నాయి.

6. కొంటాం సరే.. మరి అమ్మాలనుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి? గోల్డ్ ఆర్నమెంట్స్ కొనేటప్పుడు మేకింగ్ చార్జెస్, ప్రాఫిట్ మార్జిన్, జీఎస్టీ ఇలాంటివన్నీ వర్తిస్తాయి. తిరిగి అమ్మేటప్పుడు మాత్రం ఇవేవే తిరిగి రావనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. పైగా పాత బంగారానికి వేస్టేజ్ రూపంలో కొంత తగ్గించే అవకాశం ఉంది. సాధారణంగా రాళ్లు ఉన్న ఆభరణాలకు ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. అందువల్ల రాళ్లు ఎక్కువగా లేని ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడం బెటర్. సాధారణంగా బంగారాన్ని పెట్టుబడి పేరిట కొనుగోలు చేసేవారు కాయిన్లు, బార్ల రూపంలో కొనడం చేయడం మంచిది. సోవరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ , గోల్డ్ ETFల ద్వారా డిజిటల్‌గా బంగారం కొనే అవకాశాలను కూడా పరిశీలించడం మంచిది. ఇక చివరిగా చెప్పొచ్చేదేంటంటే... భారతీయుల నమ్మకం ప్రకారం బంగారం సంపదకు ప్రతీక. ఏడాదంతా బంగారం కొనే స్థోమత అవకాశం లేకపోయినా... కనీసం అక్షయ తృతియ పేరుతోనైనా పసిడిని కొనుగోలు చెయ్యడం వల్ల కేవలం ఆడవాళ్ల పెదవులపై చిరునవ్వును చూడటమే కాదు... భవిష్యత్తులో అనుకోని అవసరం ఏది వచ్చినా... నేనున్నాన్న భరోసాని, ధైర్యాన్ని అన్నింటికీ మించి అవసరమైన ధనాన్ని ఇస్తుంది బంగారం. అందుకే ఈ అక్షయ తృతియ సెంటిమెంట్ ఇండియాలో అంత బాగా వర్కౌట్ అవుతోంది.





























