Jagannath Temple Video Controversy: ‘గొడ్డు మాంసం తినేవారిని పూరీ జగన్నాథ ఆలయంలోకి ఎలా అనుమతిస్తారు? వెంటనే అరెస్ట్ చేయండి’

|

Dec 24, 2023 | 7:23 AM

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ప్రముఖ యూట్యూబర్ కమియా జానీ పూరీలోని జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించడంపై వివాదం నెలకొంది. పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర, విశిష్టత, వైభవం గురించి కామియా జానీ తాజాగా వీడియో చేసి, దానిని ఆమె తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే వైరల్‌ అయ్యింది. దీనిపై ఒరిస్సా బీజేపీ యూనిట్‌ అభ్యంతరం లేవనెత్తింది..

Jagannath Temple Video Controversy: గొడ్డు మాంసం తినేవారిని పూరీ జగన్నాథ ఆలయంలోకి ఎలా అనుమతిస్తారు? వెంటనే అరెస్ట్ చేయండి
Jagannath Temple Video Controversy
Follow us on

ఒరిస్సా, డిసెంబర్ 24: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ప్రముఖ యూట్యూబర్ కమియా జానీ పూరీలోని జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించడంపై వివాదం నెలకొంది. పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర, విశిష్టత, వైభవం గురించి కామియా జానీ తాజాగా వీడియో చేసి, దానిని ఆమె తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే వైరల్‌ అయ్యింది. దీనిపై ఒరిస్సా బీజేపీ యూనిట్‌ అభ్యంతరం లేవనెత్తింది. అసలామెను ఆలయంలోకి ఎందుకు అనుమతించారంటూ ప్రశ్నిస్తున్నారు. అసలేం జరిగిందంటే..

యూట్యూబర్‌ కామియా జానీ గురించి తెలియని వారుండరు. విభిన్న వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న కామినీ.. గొడ్డు మాంసం వినియోగాన్ని ప్రోత్సహిస్తూ కొన్ని వీడియోలు చేసింది. దీంతో ఆమెపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. తాజాగా పూరీ జగన్నాథ్‌ ఆలయాన్ని సందర్శించింది. ఆలయ విశిష్టతను తెలుపుతూ ఓ వీడియో చేసి తన యూట్యూబ్‌లో టెలికాస్ట్‌ చేసింది. అయితే సదరు వీడియోలో ఆమెతో బీజేడీ నాయకుడు పాండియన్‌ కూడా ఉన్నారు. ఈ వీడియోపై ఒడిశా బీజేపీ ఘాటుగా స్పందించింది. లక్షలాది మంది హిందువుల మతపరమైన మనోభావాలు కించపరిచేలా ఆలయ ప్రాంగణం నుంచి వీడియో ప్రసారం చేశారని మండిపడింది.

ఇవి కూడా చదవండి

జగన్నాథ ఆలయంలోకి గొడ్డు మాంసం తినే కామియా జానీని ఎలా అనుమతిస్తారంటూ ప్రశ్నించింది. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన పూరీ శ్రీమందిర్‌లోకి గొడ్డు మాంసం ప్రమోటర్‌ను అనుమతించడంపై అభ్యంతరం లేవనెత్తింది. వెంటనే పాండియన్‌, కమియాలపై ఐపీసీ సెక్షన్‌ 295 కింద కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. పూరీ ఆలయంలో కమియా కెమెరాతో వీడియో తీసిందని, ఆలయ ప్రాంగణంలో వీడియో తీయడం పూర్తిగా నిషేధమని ఒడిశా బీజేపీ ప్రధాన కార్యదర్శి జతిన్ మొహంతి ఆరోపించారు. వీడియో చేయడానికి ఆమెకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. హిందువుల మతపరమైన మనోభావాలను కించపరిచినందుకు పాండియన్, జానీలపై చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు బీజేడీ నాయకుడు పాండియన్‌, యూట్యూబర్ కమియా జానీకి వ్యతిరేకంగా జగన్నాథ్ సురక్షా అభియాన్ సమితి ఆందోళన చేపట్టింది. శనివారం జగన్నాథ సురక్షా అభియాన్ కమిటీ సభ్యులు ప్లకార్డులు, పోస్టర్లు చేతపట్టుకుని వీధుల్లో బైఠాయించి నిరసన తెలిపారు. కామియా పాత వీడియోలు, స్క్రీన్‌ షాట్‌లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పూరీలోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించినట్లు ఉన్న కామియా జానీ ఫొటోలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. తాజా వివాదంపై జగన్నాథ ఆలయంలోకి కామియా జానీ ప్రవేశంపై ఆలయ కమిటీ స్పందించింది. యూట్యూబర్ కమియా కెమెరాతో ఆలయంలోకి ప్రవేశించినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేసింది.

ఇక ఈ ఆరోపణలను కామియా జానీ ఖండించింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేయడమే తన లక్ష్యమని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తెలిపింది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జ్యోతిర్లింగాలు, చార్ ధామ్‌లను సందర్శిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తానెప్పుడు గొడ్డు మాంసం తినలేదని కూడా కామియా జానీ క్లారిటీ ఇచ్చింది. తాజా వివాదంపై తనని ఇంతవరకూ ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.