Nirmala Sitharaman – GST: హాస్పిటల్ బెడ్ లేదా ఐసీయూపై జీఎస్టీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. దేశంలో ధరల పెరుగుదలపై మంగళవారం రాజ్యసభలో మాట్లాడిన కేంద్ర మంత్రి సీతారామన్ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఆసుపత్రుల బెడ్, ఐసీయూపై జీఎస్టీ లేదని.. రోజుకు రూ.5000 అద్దె ఉన్న గదిపై మాత్రమే పన్ను వర్తిస్తుందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై సమాధానమిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయంటూ సీతారామన్ మరోసారి స్పష్టంచేశారు. బ్యాంకు లావాదేవీలపై జీఎస్టీ ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రి సీతారామన్ మాట్లాడుతూ.. బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేస్తే ఎలాంటి జీఎస్టీ ఉండదని స్పష్టంచేశారు. ప్రింటర్ నుంచి బ్యాంకులు కొనుగోలు చేసే చెక్‌బుక్‌లపైనే జీఎస్టీ ఉంటుందని.. వినియోగదారుల చెక్‌బుక్‌లపై పన్ను ఉండదని పేర్కొన్నారు.
ముందుగా ప్యాక్ చేసి లేబుల్ వేసిన ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయని గుర్తుచేశారు. అప్పుడు ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదని పేర్కొన్నారు. పేదలు వినియోగించే ఏ వస్తువు పైనా పన్ను విధించలేదని పేర్కొన్నారు. ప్యాక్ చేసిన ఆహారం కాకుండా.. విడిగా విక్రయిస్తే ఎలాంటి పన్నూ ఉండదని తెలిపారు.
No GST on hospital bed or ICU, tax only on room with Rs 5000 per day rent, says FM Sitharaman in Rajya Sabha
— Press Trust of India (@PTI_News) August 2, 2022
అన్ని రాష్ట్రాలు తృణధాన్యాలు, పప్పులు, పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి కొన్ని ఆహార పదార్థాలపై పన్ను విధించాయంటూ పేర్కొన్న సీతారామన్.. ఆహార పదార్థాలపైనా జీఎస్టీ విధించడాన్ని సమర్థించుకున్నారు. శ్మశానవాటికలకు జీఎస్టీ లేదని.. కొత్త శ్మశానవాటికల నిర్మాణంపై మాత్రమే పన్ను ఉంటుందని పేర్కొన్నారు.
ఇతర దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పోల్చుతూ.. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్లే దేశంలో ద్రవ్యోల్బణం రేటు 7 శాతంగా ఉందని పేర్కొన్నారు. ధరల పెరిగాయన్నది ఎవరూ కాదనలేని అంశమని.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి