డీకేను సీఎం చేయాల్సిందే.. కర్ణాటకలో మళ్లీ రచ్చ రచ్చ.. ఏం జరగబోతోంది..?

కర్ణాటకలో సీఎం మార్పు వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే డీకే శివకుమార్‌ను సీఎం చేయాలని పలువురు ఎమ్మెల్యే వ్యాఖ్యానించగా.. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వారితో చేరారు. సీఎం మార్పు అంశంపై వారు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా డీకే శివకుమార్ సైతం సీఎం కావాలని ఉందంటూ వ్యాఖ్యానించి పొలిటికల్ హీట్ పెంచారు.

డీకేను సీఎం చేయాల్సిందే.. కర్ణాటకలో మళ్లీ రచ్చ రచ్చ.. ఏం జరగబోతోంది..?
Dk Shiva Kumar Siddaramaiah

Updated on: Jul 08, 2025 | 5:31 PM

కన్నడనాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పైకి అంతా బాగానే ఉన్నట్లు నటిస్తున్నా.. సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎంగా పరిస్థితి సాగతుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ సీఎం కావాలని అంటున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనకే మద్ధతుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు డీకే.. నాయకత్వం మార్పు ఏమి ఉండదని తొలుత వ్యాఖ్యానించి.. తాజాగా సీఎం కావాలనే ఆశ ఎవరికి ఉండదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి వచ్చిన వెంటనే డీకేనే సీఎం అవుతారని అంతా అనుకున్నారు. కానీ హైకమాండ్ మాత్రం సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అప్పటి నుంచి డీకే – సిద్ధరామయ్య వర్గాల మధ్య అంత సఖ్యత లేదు. అవకాశం దొరికినప్పుడల్ల డీకే వర్గీయులు డీకేను సీఎం చేయాలని వ్యాఖ్యలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. నేను ఐదేళ్లు సీఎంగా ఉంటానని ఇటీవల ఏకంగా సీఎం సిద్ధరామయ్య చెప్పినా కూడా ఈ కామెంట్స్ ఆగడం లేదు. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు.

డీకే శివకుమార్ సీఎం కావాలని మా జిల్లా ఎమ్మెల్యేలంతా కోరుకుంటున్నారని ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ అన్నారు. ఈ అంశంపై తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవని.. త్వరగా హైకమాండ్ నిర్ణయం తీసకోవాలని కోరారు. ‘‘కొత్త నాయకత్వం రావాలి. అవకాశమిస్తేనే అది జరుగుతుంది. హైకమాండ్ సైలెంట్‌గా ఉండకుండా కీలక నిర్ణయ తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని మాజీ మంత్రి తన్వీర్ సైత్ అన్నారు. వీరి వ్యాఖ్యలు మరోసారి పొలిటికల్ హీట్ పెంచాయి. ప్రతి ఒక్కరికి ఆశలు, కోరికలు ఉంటాయి.. దీనిపై ఏం చెప్పదలుచుకోలేదని కేపీసీసీ ఇంచార్జ్ రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య, డీకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశాలు ఉన్నాయి.

కాంగ్రెస్ కుర్చీ లొల్లిపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యపై విశ్వాసం కోల్పోయారని.. రాష్ట్ర ప్రజలు కూడా ఇదే స్థితిలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర అన్నారు. సీఎంగా వేరే వ్యక్తిని ఎన్నుకున్నా ప్రజలకు ఒరిగేది ఏం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఎవరు ముఖ్యమంత్రి అయినా.. రాష్ట్రాభివృద్ధిని ఊహించడం కష్టమేనని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..