Prashant Kishor: సీఎం కుర్చీకి ఫెవికోల్ అంటించుకున్నారు.. నితీశ్‌పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

|

Aug 18, 2022 | 11:21 AM

Bihar Politics: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేడీయు చీఫ్ నితీశ్ కుమార్ సీఎం కుర్చీకి ఫెవికోల్ అంటించుకుని కూర్చున్నారని.. మిగతా పార్టీలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు.

Prashant Kishor: సీఎం కుర్చీకి ఫెవికోల్ అంటించుకున్నారు.. నితీశ్‌పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Nitish Kumar, Prashant Kishore
Follow us on

Bihar Politics: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌(Nitish Kumar)పై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేడీయు చీఫ్ నితీశ్ కుమార్ సీఎం కుర్చీకి ఫెవికోల్ అంటించుకుని కూర్చున్నారని.. మిగతా పార్టీలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో జట్టు కట్టి బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఎనిమిదో సారి బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ వారం క్రితం ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఆయనపై ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జన్ సురాజ్ అభిమాన్ ద్వారా బీహార్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్ రాబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సమస్తిపూర్‌లో తన మద్ధతుదారులతో పీకే భేటీ అయ్యారు. జేడీయు- ఆర్జేడీ – కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో పెద్దగా ఆదరణ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

నితీశ్ కుమార్ గతంలో ఇచ్చిన ఓ హామీని నెరవేరిస్తే.. తన జన్ సురాజ్ అభియాన్‌ను ఉపసంహరించుకుని.. నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్ధతు ప్రకటిస్తానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీహార్ యువతకు పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అలాగే నితీశ్ కుమార్ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో 20 లక్షల ఉద్యోగాల సృష్టిస్తామని ప్రకటించారని చెప్పారు. వచ్చే ఏడాది, రెండేళ్లలో వారిద్దరూ తమ హామీని నెరవేరిస్తే.. తన జన్ సురాజ్ అభియాన్‌ను ఆపేసి నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్ధతు ప్రకటిస్తానని తెలిపారు.

జన్ సురాజ్ అభియాన్ ద్వారా ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రాంతాల వారీగా సమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపడమే జన్ సురాజ్ అభిమాన్ ఉద్దేశమని గతంలో ఆయన స్పష్టంచేశారు. అయితే 2025 అసెంబ్లీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని రాజకీయ వార్తలు చదవండి