Nitish Kumar: విపక్షల ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్..? జేడీయు సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుని.. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమితో జేడీయూ జట్టుకట్టిన తర్వాత.. దేశ రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయనే చర్చ జోరందుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి పోటీగా..
Nitish Kumar: బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుని.. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమితో జేడీయూ జట్టుకట్టిన తర్వాత.. దేశ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయనే చర్చ జోరందుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి పోటీగా జేడీయూ నేత నితీష్ కుమార్ ని ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు ప్రొజక్ట్ చేస్తాయనే ప్రచారం జరుగుతోంది. అయితే తాను ప్రధానమంత్రి అభ్యర్థికి పోటీదారుడుని కాదంటూ ఆ వార్తలను నితీష్ గతంలో తోసిపుచ్చారు. అయితే ఇదే అంశంపై జేడీయూ జాతీయ అధ్యక్షులు, ఎంపీ లాలన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ ప్రధానమంత్రి అభ్యర్థి కావాలని విపక్ష పార్టీలు కోరుకుంటే.. ఇది ఓ అప్షన్ అవుతుందని వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొవడానికి, ప్రతిపక్ష పార్టీలను ఐక్యం చేయడంపై నితీష్ కుమార్ దృష్టిసారించారని చెప్పారు. బీహార్ శాసనసభలో విశ్వాస పరీక్ష తర్వాత సీఎం నితీష్ కుమార్ ఢిల్లీ వెళ్లి వివిధ విపక్ష నాయకులతో సమావేశమవుతారని లాలన్ సింగ్ వెల్లడించారు.
బీహార్ లో సుదీర్ఘకాలం పాటు సీఎంగా సేవలందిస్తున్న నితీష్ కుమార్ జేడీయూ ముఖ్య నేతగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారని.. అయితే విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థికి పోటీదారుడు కాదని లాలన్ సింగ్ వెల్లడించారు. అయితే పార్టీలన్ని ఏకమై ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంచుకోవడానికి నితీష్ కుమార్ ఓ ఆప్షన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. బీజేపీతో పొత్తు తెంచుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఎంతో మంది నాయకులు నితీష్ కుమార్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని జేడీయూ అధ్యక్షులు లాలన్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ప్రధానమంత్రి కావడానికి అవసరమైన అన్ని అర్హతలు నితీష్ కుమార్ కు ఉన్నాయని లాలన్ సింగ్ స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలన్ని ఏకతాటిపైకి వచ్చి సమర్థ నాయకుడిని ఎంచుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేదా బీజేపీని ఓడించడానికి విపక్ష పార్టీలన్ని ఐక్యంగా పోరాడి.. తరువాత నాయకుడిని ఎంచుకోవల్సి ఉంటుందన్నారు. ఏది ఏమైనా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని ఓకే వేదికపైకి తీసుకురావడానికి నితీష్ కుమార్ తన వంతు కృషి చేస్తారని లాలన్ సింగ్ తెలిపారు. లాలన్ సింగ్ వ్యాఖ్యలను బట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండేందుకు నితీష్ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..