కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్ వేడుకలో పోలీస్, ఆర్మీ, పారమిలటరీ దళాలు పాల్గొంటాయనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు జరిగిన ఈ వేడుకల్లో పురుషులు, మహిళలలు పాల్గొనేవారు. కానీ వచ్చే ఏడాది మాత్రం ఈ సంప్రదాయాన్ని మార్చనున్నారు. 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో అందరూ మహిళలే కనిపించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సైనిక, ఇతర రంగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని, సాధికారతను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్ణయం అమలుపై వివిధ శాఖల అధిపతులతో కసరత్తు జరుగుతున్నట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
అయితే గత మార్చిలోనే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొననున్న వివిధ రక్షణ సంస్థలు, ఆర్మీ, పోలీస్, పారామిలటరీలకు ఈ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది పరేడ్‌కు నేతృత్వం వహించే దగ్గరి నుంచి బ్యాండ్ పార్టీ, శకటాల ప్రదర్శనల వరకు అందరూ మహిళలే ఉండనున్నారని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు కేంద్రం నుంచి ఈ విషయంపై తమకు కూడా అధికారిక లేఖ అందిందని, అయితే, దీనిని ఎలా అమలు చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్సు ఆర్మీ వర్గాలు కూడా వెల్లడించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.