ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో కొత్త ట్విస్ట్ .. ఆ ఇంటి సమీపంలో కనుగొన్న ఎస్ యూ వీ వాహన యజమాని మాన్ సుఖ్ హీరేన్ ..దీని తాళాలను సచిన్ వాజేకి ఇఛ్చాడట. (వాజేను ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది).ఫిబ్రవరి 17 న ముంబైలోని ఫోర్ట్ ఏరియాలో హిరేన్, వాజే మధ్య ఓ సమావేశం జరిగిందని, ఆ మీటింగ్ లో తన కారు తాళాలు ఇస్తానని హిరేన్ చెప్పాడని తెలుస్తోంది. ఆ రోజు అతడు తన స్కార్పియో కారును విక్రోలీ హైవేపై వదిలేశాడని, అదే రోజు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఫోర్ట్ ఏరియా నుంచి అతడు రోడ్డు దాటి అప్పటికే వేచి ఉన్న బ్లాక్ మెర్సిడెస్ వాహనం ఎక్కాడని తాజా సీసీటీవీ ఫుటేజీలో కనుగొన్నారు. ఈ వాహనాన్ని వాజే నడుపుతుండగా హిరేన్..స్కార్పియో కారు తాళాలను ఆయనకు ఇచ్చినట్టు తెలుస్తోంది. తన ఈ వాహనాన్ని సెంట్రల్ ముంబైలోని విక్రోలీ ఏరియాలో పార్క్ చేశానని, అనంతరం సౌత్ ముంబైలోని క్రాఫర్డ్ మార్కెట్ కు చేరేందుకు ట్యాక్సీని మాట్లాడుకున్నానని హిరేన్ చెప్పాడని సమాచారం . ఆ మరుసటి రోజున అతని ఎస్యూవీ వాహనం చోరీకి గురైంది. అప్పుడు క్రైమ్ ఇంటెలిజెన్స్ హెడ్ గా ఉన్న సచిన్ వాజే అతని వాంగ్మూలాన్ని నమోదు చేశాడు. కానీ ఫిబ్రవరి 17 న హిరేన్ తో జరిపిన తన సమావేశం తాలూకు విషయాన్నీ ఆయన రికార్డు చేయకుండా దాచిపెట్టాడు.
వారం రోజుల అనంతరం స్కార్పియో వాహనం అంబానీ ఇంటికి కొంత దూరంలో కనబడింది. మార్చి 4 న బాంబ్ స్క్వాడ్ బృందం ఇందులో జిలెటిన్ స్టిక్స్ ని కనుగొంది. ఆ మరుసటి రోజున హిరేన్ మృతదేహాన్ని థానేలో కనుగొన్నారు. ఇతని మృతికి వాజే కారకుడని, కుట్ర పన్నాడని మహారాష్ట్ర యాంటీ టెర్రర్ యూనిట్ అధికారులు పేర్కొన్నారు. కాగా హిరేన్ మరణానికి ముందు అతనికి డ్రగ్ ఇచ్చినట్టు తాజా వార్తలు తెలుపుతున్నాయి. హిరేన్ కేసును మర్డర్ కేసుగా యాంటీ టెర్రర్ యూనిట్ అధికారులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద కాన్వాస్ పెయింటింగ్.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవుతారు.!