యువ రక్తంతో నిండిన భారతదేశం మాత్రమే కాదు, నిరుద్యోగ సమస్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను వేధిస్తోంది. విద్యావకాశాలు పెరగడంతో యూనివర్సిటీల నుంచి పట్టభద్రులు కుప్పలుతెప్పలుగా బయటికొస్తున్నారు. అయితే చాలామంది చేతిలో డిగ్రీ పట్టాలు ఉంటున్నాయి కానీ ఏదైనా ఉద్యోగం చేయడానికి అవసరమైన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేయడంలో ఇది కూడా ఒక కీలకాంశంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొన్ని కొత్త పథకాలను ప్రతిపాదించింది. ముఖ్యంగా యువతకు నైపుణ్య శిక్షణ కోసం ఏకంగా రూ. 2 లక్షల కోట్లతో ప్రధాన మంత్రి ప్యాకేజి ప్రకటించారు. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఐదు పథకాలు, కార్యక్రమాలను ప్రకటించారు. ఐదేళ్ల పాటు 4.1 కోట్ల యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, ఇతర అవకాశాల కల్పనకు ఈ ప్యాకేజీ తోడ్పడనుంది. నైపుణ్యాభివృద్ధి, కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యం పెంచడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME)కు సహకారాన్ని అందించడం, మూలధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి కల్పనకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఈ పథకాల లక్ష్యం. ఇవన్నీ సమిష్టిగా దేశ ఉపాధి రంగంపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఐదు పథకాల్లో మూడు పథకాలు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPF) ద్వారా అమలవుతాయి. ఉద్యోగులతో పాటు యాజమాన్యాలకు సైతం ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఈ పథకాలు ఉపాధి కల్పనతో సరిపెట్టకుండా శ్రామికశక్తి క్రమబద్దీకరణను ప్రోత్సహిస్తాయి. ఆ పథకాలు..
మొదటి పథకం: ఈపీఎఫ్ఓతో నమోదై ఉన్న సంఘటిత రంగంలోని మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఉద్దేశించినది. వీరికి ఒక నెల వేతనం (రూ.15,000 వరకు) మూడు వాయిదాల్లో ప్రభుత్వం చెల్లిస్తుంది.
రెండో పథకం: తయారీ రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి తొలిసారి ఉద్యోగంలో చేరిన వారు మొదటి నాలుగేళ్లలో చెల్లించిన ఈపీఎఫ్ఓ మొత్తం ఆధారంగా ఉద్యోగులకు, యాజమాన్యానికి ప్రోత్సాహకం అందిస్తుంది. నెలకు రూ.1 లక్ష వరకు వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు.
మూడో పథకం: అదనంగా ఉద్యోగాలు కల్పించే యాజమానులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది. నెలకు రూ.1 లక్ష వరకు వేతనంతో పని చేసే ఒక్కో కొత్త ఉద్యోగిపై ఈపీఎఫ్ఓలో యాజమాని జమ చేసే మొత్తాన్ని నెలకు రూ.3,000 వరకు రెండేళ్ల పాటు ప్రభుత్వం తిరిగి యాజమానికి చెల్లిస్తుంది.
ఉద్యోగ కల్పనలో యాజమాన్యాలకు తమ అవసరాలకు సరిపడ నైపుణ్యాలు కల్గిన మానవ వనరులను వెతుక్కోవడం కూడా ఒక సమస్యగా మారుతోంది. అదే సమయంలో తమ నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం అటు నిరుద్యోగులకు కూడా కష్టతరంగా మారుతోంది. ఈ క్రమంలో నైపుణ్య అవసరాలు, ఉద్యోగాలను ఒకే వేదికపై సులభంగా పొందేందుకు, యాజమాన్యాలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో ఉద్యోగార్ధులను అనుసంధానం చేసేందుకు కేంద్రం నడుం బిగించింది. ఈ-శ్రమ్ పోర్టల్‌ను ఇతర వేదికలతో అనుసంధానించాలని కేంద్రం నిర్ణయించింది. కార్మిక సంక్షేమం, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి వంటి వాటి కోసం ఈ-శ్రమ్ పోర్టల్ ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అదే ఇప్పుడు ఒక అనుసంధానకర్త మాదిరిగా కూడా మారనుంది. అలాగే ఈ బడ్జెట్‌లో పారిశ్రామిక ప్రమాణాలను క్రమబద్దీకరించడం, కార్మికుల కోసం ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఉద్దేశించిన ‘శ్రమ్ సువిధ’, ‘సమాధాన్’ పోర్టళ్లను పునరుద్ధరించనున్నట్టు కేంద్రం వెల్లడించింది.
ప్రధానమంత్రి ప్యాకేజీలోని మిగతా రెండో పథకాల విషయానికొస్తే.. నైపుణ్యాలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలను పెంచి, తద్వారా ఉద్యోగ అవకాశాలను పెంపొందించాలని కేంద్రం ఆశిస్తోంది.
నాలుగో పథకం: రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ భాగస్వామ్యంతో ఐదేళ్ల పాటు దాదాపు 20 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేందుకు కొత్తగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. దీంతో పాటు పరిశ్రమ నైపుణ్య అవసరాలకు తగ్గట్టుగా 1,000 పారిశ్రామిక శిక్షణ సంస్థల (ITI)లను ఆధునీకరించనున్నారు.
ఐదో పథకం: రానున్న ఐదేళ్లలో 500 అత్యున్నత సంస్థల్లో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించడం. ఇందుకు గానూ ఇంటర్న్‌షిప్ భత్యంగా నెలకు రూ.5,000, వన్ టైమ్ ప్రోత్సాహకంగా రూ.6,000 ప్రభుత్వం చెల్లిస్తుంది. పనిప్రదేశాల్లో పరిస్థితులను, వృత్తిపరమైన వాతావరణాన్ని తెలుసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇటు నిరుద్యోగులకు నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఉపయోగపడడంతో పాటు, అటు యాజమాన్యాలకు తమ అవసరాలకు సరిపోయే ఇంటర్నీలను ఉద్యోగులుగా తీసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.
కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకు గానూ పరిశ్రమ సహకారంతో ఉద్యోగం చేసే మహిళల కోసం వర్కింగ్ వుమెన్ హాస్టళ్లు, శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటును బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీంతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, స్వయం సహాయ సంఘాల(SHG) వ్యాపారాలకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తారు.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా ఉపాధి సృష్టించడం: మూలధన వ్యయం గణనీయంగా 11 శాతానికి పెంచి, రూ.11.11 లక్షల కోట్లను వెచ్చించాలనే నిర్ణయం వల్ల నిర్మాణ, రవాణా, లాజిస్టిక్స్ వంటి వేర్వేరు రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చని భావిస్తోంది.
వ్యాపారాలను ప్రోత్సహించడం: స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈకు ఆర్థిక సహకారాన్ని, పన్ను ప్రయోజనాలను అందించడం ద్వారా వ్యాపార దృక్పథాన్ని పెంచి విభిన్న ఉపాధి అవకాశాలను సృష్టించాలని కేంద్రం భావిస్తోంది.
గ్రామీణ ఉద్యోగ, జీవనోపాధి: ఎంజీఎన్ఆర్ఈజీఏకు నిధులను పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు గ్రామీణ సమాజాలకు చేయూతను అందించడం, పట్టణ ప్రాంతాలకు వలసలను తగ్గించేలా చూడటం.
తయారీ, సేవా రంగాలను ప్రోత్సహించడం: 100 నగరాల్లో ఉత్పత్తికి సిద్ధంగా ఉండేలా “ప్లగ్ ఆండ్ ప్లే” పారిశ్రామిక పార్కులను ఏర్పాటుతో పాటు జాతీయ పారిశ్రామిక నడవా (నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్) అభివృద్ధిలో భాగంగా 12 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనుంది. తద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం, లక్షల్లో ఉద్యోగాలు సృష్టించడం ఈ పథకం లక్ష్యం.
సుస్థిరాభివృద్ధి, అపారమైన ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం, నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వికసిత్ భారత్‌కు బలమైన సామాజిక సంక్షేమ పునాది వేయడం కోసం అనేక చర్యలు చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..