NEET Exam: డాక్టర్ కోర్స్ చేయాలని చాలా మంది విద్యార్థులు ఆశపడతారు. అయితే డాక్టర్ అవ్వాలనే విద్యార్థుల ఆశలకు ‘నీట్’ ప్రతిబంధకంలా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదికోసారి మాత్రమే నిర్వహించే ‘నీట్’ వల్ల ఎంతోమంది విద్యార్థులు తమ అవకాశాలను కోల్పోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. తమళనాడు సహా కొన్ని రాష్ట్రాలైతే ‘నీట్’ వొద్దంటూ కేంద్రానికి అనేకమార్లు విజ్ఞప్తి చేశాయి. కానీ, కేంద్రం మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఇలాంటి తరుణంలో వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం ‘నీట్’ పరీక్షను ఏడాదికి రెండు దఫాలుగా నిర్వహించాలని కొత్త డిమాండ్లు తెరమీదకు వచ్చాయి.
దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డిమాండ్‌పై ఫోకస్ పెట్టింది. జేఈఈ తరహాలోనే నీట్ పరీక్షను కూడా సంవత్సరానికి ఒకసారి కన్నా ఎక్కువసార్లు నిర్వహించాలనే ప్రతిపాదనపై ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర విద్య, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు సహా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు సోమవారం భేటీ అవుతున్నారు. ఈ భేటీలో నీట్ పరీక్ష విధానంలో మార్పులు చేయడంపై చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏడాదికి ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్ష నిర్వహించడంతో పాటు.. కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. జేఈఈ మెయిన్స్‌ని ఈ ఏడాది నుంచి నాలుగు దఫాలుగా నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా కూడా మార్పు చేశారు.
Also read:
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మధ్య సమన్వయం పెరగాలి.. అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్