National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఈడీ వరుసగా రెండోరోజు విచారించింది. నేటి విచారణలో ఈడీ అధికారులు వేసిన పలు ప్రశ్నలకు రాహుల్ ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజు విచారణ అనంతరం ఇవాళ కూడా రాహుల్‌ను విచారించిన ఈడీ.. యంగ్ ఇండియా సంస్థపై యాజమాన్య హక్కులు, ఏజేఎల్ సంస్థలో వాటాలకు సంబంధించి రాహుల్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. అలాగే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. కాగా, వీరి ప్రశ్నలకు స్పందించిన రాహుల్ గాంధీ.. రుణం బదిలీ విషయంలో ఎలాంటి అక్రమాలు జరుగలేదని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తన స్టేట్‌మెంట్‌ను కచ్చితంగా టైప్ చేయాలని ఈడీ అధికారులను రాహుల్ కోరారు. 50 పేజీల స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు టైప్ చేసినట్టు తెలుస్తోంది. అయితే నేషనల్ హెరాల్డ్‌కు లోన్ విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, రుణం చెల్లింపు ప్రక్రియ కూడా పూర్తయినట్టు రాహుల్ చెప్పినట్టు తెలుస్తోంది.
ఇవాళ ఉదయం 11 గంటలకు చెల్లెలు ప్రియాంకా గాంధీతో కలిసి ఏఐసీసీ ఆఫీసుకు వచ్చిన రాహుల్ గాంధీ.. అక్కడ కొంత సేపు నేతలతో కలిసి కూర్చున్నారు. ఆ తర్వాత బయల్దేరి ఈడీ ఆఫీసుకు వెళ్లారు. రాహుల్‌తో పాటు ఈడీ ఆఫీసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర సీనియర్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్‌గాంధీకి బీజేపీ భయపడుతోందని విమర్శించారు కాంగ్రెస్ నేత సూర్జేవాలా. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు దిగిందని ఆరోపించారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇటు రెండో రోజు హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఈడీ ఆఫీసు ముందు దీక్ష చేపట్టారు.