దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల్లో ఉదయం స్టూడెంట్స్ జాతీయ గీతాన్ని ఆలపిస్తారు.. ఇప్పటి వరకూ ఈ నియమం జమ్మూ కశ్మీర్ స్కూల్స్ కు వర్తించేది కాదు.. అయితే జాతీయ గీతం ఆలాపన విషయంలో జమ్మూ కశ్మీర్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లో జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని పాఠశాల విద్యా శాఖ అన్ని పాఠశాలలను జాతీయ గీతంతో ఉదయం అసెంబ్లీని ప్రారంభించాలని ఆదేశించింది. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూలోని అన్ని స్కూల్స్ లో ఉదయం అసెంబ్లీ ఏకరీతిగా జరపాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఇక నుంచి జమ్ము కశ్మీర్ స్కూల్ లో జనగణమణ గీతం వినిపించనుంది.
ఇలా అసెంబ్లీ జాతీయ గీతంతో పాఠశాల మొదలు పెట్టడం.. ఉదయం నిర్వహించే నైతిక సమగ్రత విలువలను పెంపొందించడంతో పాటు అసెంబ్లీ విద్యార్థుల మధ్య ఐక్యత, క్రమశిక్షణను పెంపొందిస్తుందని జమ్మూ కశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అలోక్ కుమార్ తెలిపారు. ఈ సమయంలో పాఠశాలలకు అతిథి వక్తలను ఆహ్వానించాలని, పర్యావరణంపై అవగాహన కల్పించాలని, ఉదయం జరిగే సమావేశాల్లో డ్రగ్స్‌పై అవగాహన పెంచుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
మానసిక, శారీరక శ్రేయస్సుపై మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల (ఎన్‌డిపిఎస్) హానికరమైన ప్రభావాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని సర్క్యులర్ లో పేర్కొంది. మార్గదర్శకాల ప్రకారం ఉదయం అసెంబ్లీ వ్యవధి 20 నిమిషాలుగా నిర్ణయించబడింది. విద్యార్థులకు సమాజంలోని పరిస్థితులు, భిన్నమైన సంస్కృతులు, చారిత్రక విషయాలు, పర్యావరణంపై అవగాహన వంటి 16 అంశాలను పాఠశాలల్లో తప్పనిసరిగా పాటించాలని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..